తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య అంతరం మరింత పెరిగిపోయింది. ఉగాది పర్వదినం రోజున తమిళిసై మొదటిసారిగా యాదాద్రికి వచ్చారు. ఆలయ ఈవో గీతా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్కు ఈవో స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే ఈవో అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ పర్యటన పూర్తయ్యే వరకు ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి ఏర్పాట్లను చూసుకున్నారు.
ఇప్పటికే రిపబ్లిక్ వేడుకలు, మేడారం జాతర సమయాల్లోనూ గవర్నర్కు ఇదే రకంగా అవమానం జరిగింది. ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం చెప్పాల్సిన వారు డుమ్మా కొట్టారు. ఇపుడు యాదాద్రిలో ఇదే సీన్ రిపీట్ అయింది. మధ్యాహ్నం గవర్నర్ పర్యటన సమయంలో కనిపించని ఈవో గీతారెడ్డి.. రాత్రి జరిగిన పంచాంగ శ్రవణానికి మాత్రం హాజరయ్యారు.
ఉగాదిని పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా వున్నారు. అంతేకాదు.. టీఆర్ఎస్ నేతలు ఎవరూ అటెండ్ కాలేదు. వేడుకల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులకు ఆహ్వానం పంపారు. కానీ.. వారెవ్వరూ హాజరు కాలేదు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.