తెలుగు మీడియంతో వీధి బడిలో చదువుకున్నోళ్లకు స్పందన ఎక్కువంటారు. ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ తో ఎదిగిన వాళ్ల కన్నా సృజనాత్మత కలిగి ఉంటారు. సమస్యలపై స్పందించే గుణం ఎక్కువ. అందులోనూ కరవు సీమ నుంచి ఎదిగిన వాళ్లయితే చెప్పాల్సిన పన్లేదు. గుంటూరు జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపడుతున్న మట్లి వేణుగోపాలరెడ్డి కూడా అలాంటివారే. ఈరోజు బాధ్యతలను స్వీకరించనున్న కలెక్టరు వేణుగోపాలరెడ్డికి గుంటూరు జిల్లా వాసులు ఎన్నో ఆకాంక్షలతో స్వాగతం పలుకుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల పుణ్యమా అని సగటు జిల్లా తీవ్రమైన ఆర్థిక ఒడిదుడకులు ఎదుర్కొంటున్నారు. నిరంతరం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలతో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు.
పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు ఆశించిన స్థాయిలో పారిశ్రామిక వృద్ధి లేక ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులకు నోచులేదు. వాతావరణ మార్పులతో పంటలు చీడపీడలకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ కూలీలు కౌలు రైతులై అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ప్రత్యేకించి అర్బన్ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కరవైంది. వ్యవసనాలతో అసాంఘిక కార్యకలాపాలకు ఆకర్షితులయ్యే ప్రమాదముంది. రాజధాని ప్రకటన తర్వాత భూమి విలువ పదింతలైంది. సామాన్యుడికి అందకుండా పోయింది.
చిరుద్యోగులు.. చిరు వ్యాపారుల జీవితాలు ఛిద్రమయ్యాయి. పెరిగిన అప్పులు తీర్చే మార్గంలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇన్ని సమస్యలకు ఓ కలెక్టరు స్థాయిలో కనీస ఉపశమనం కల్పిస్తారనే బోలెడు ఆకాంక్షలతో జిల్లా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.

కలెక్టరు ఎం వేణుగోపాలరెడ్డి సొంతూరు కడప జిల్లా జాఫర్ సాహెబ్ పల్లి. ఓ పేద రైతు కుటుంబంలో జన్మించారు. వీధి బడి నుంచే విద్యాభ్యాసం మొదలైంది. అట్లూరు, బద్వేలు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు. బద్వేల్లో ఇంటర్, కడపలో డిగ్రీ చదివారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు.
గ్రూపు –1లో స్టేట్ టాపర్గా నిలిచారు. మొట్టమొదట నెల్లూరు ఆర్డీవోగా ఉద్యోగంలో చేరారు. అక్కడ నుంచి ఒక్కో మెట్టు ఎదిగారు. ఎక్కడ చేసిన ఏ బాధ్యతల్లో చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టరుగా ప్రజల ఆకాంక్షలకు అద్దం పడతారని ఆశిద్దాం.