హైదరాబాద్ బంజారాహిల్స్ పబ్‌లో డ్రగ్స్ సరఫరా కలకలం సృష్టించింది. పబ్ ఓనర్ పక్కా ప్రణాళికతో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి పబ్ యజమాని అనిల్ కుమార్, మేనేజరు అభిషేక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. పరారీలో ఉన్న వీరమాచినేని అర్జున్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విదేశీ పర్యాటకుల కోసం 24 గంటలు నడిపేందుకు అనుమతి ఉన్న ఈ పబ్‌ను డ్రగ్స్ సరఫరా కోసం వినియోగిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు దాడి చేసిన సమయంలో మొత్తం 148 మంది ఉన్నారు. అందులో పబ్ సిబ్బంది 20 మంది పోగా 90 మంది యువకులు, 38 మంది యువతులున్నారు. వీరిలో కొణిదెల నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 5 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు బయటకొచ్చాయి. పరిమిత సంఖ్యలో గ్రూపులు తయారు చేసి ఓ యాప్ సాయంతో డ్రగ్స్ అందిస్తున్నారు. పబ్ యజమానులకు బాగా తెలిసిన వారిలో రెండు వందల మందిని యాప్‌లో రిజిస్టర్ చేశారు. ప్రతీ ఒక్కరికీ ఒక్కో కోడ్ ఇస్తారు. డ్రగ్స్ అందుబాటులో ఉన్నప్పుడు ప్రత్యేకమైన వ్యక్తులకు ఆహ్వానం వెళ్తుంది. వాళ్లు పబ్కొచ్చి ఓటీపీ ఎంటర్ చేస్తేనే లోపలకు అనుమతి ఉంటుంది.
పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలో ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారనే ప్రశ్న ముందుకొస్తోంది. దీనిపై బంజారా హిల్స్ఇన్స్పెక్టరు శివచంద్రను సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్‌కు చార్జి మెమో ఇచ్చారు. అంతర్గత విచారణకూ ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.