జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలున్నా అధికార పార్టీ నేతలు మౌనంగా ఉండిపోయారు. ప్రజల్లో మాత్రం ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పుకుంటోంది. ఆచరణలో మాత్రం ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ఇష్టానుసారం విభజించినట్లు స్పష్టమవుతోంది.
తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకు సుదూరంగా ఉన్న గిరిజనుల ప్రాంతం రంప చోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని ప్రజలను అభ్యర్థనలు వచ్చాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైనా గిరిజనులకు జిల్లా కేంద్రం దగ్గర కాలేదు. యథాతథ స్థితి కొనసాగుతున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 40 కిలోమీటర్ల దూరానున్న కందుకూరు డివిజన్ను నెల్లూరులో కలిపారు. 35 కిలోమీటర్లుండే అద్దంకి, 60 కిలోమీటర్లుండే చీరాలను బాపట్ల జిల్లాలోకి తీసుకెళ్లారు.
100 నుంచి 145 కిలోమీటర్ల సుదూరానున్న మార్కాపురం డివిజన్ని అలాగే జిల్లాలో కొనసాగించారు. ఈ జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గం ప్రకారం విభజన జరగలేదు. అలాగైతే సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్లలో కలపాలి. దీనికి భిన్నంగా ప్రకాశంలోనే ఉంచారు.
జిల్లా కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను సుదూరానుండే కొత్త జిల్లాల్లో కలపడం వల్ల పరిపాలనా సౌలభ్యం ఎలా ఏర్పడుతుందో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదని మొన్నామధ్య నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.
అనాలోచితంగా విభజిస్తే భవిష్యత్తులో ప్రాంతాల మధ్య వైషమ్యాలు, నీళ్ల ప్రాజెక్టుల వద్ద ఘర్షణలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. అయినా ప్రభుత్వం తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్లంటూ ముందుకెళ్లడం విచారకరం.