తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీసీపీ నేతలతో పాటు పార్టీ సీనియర్లతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ లోని అన్ని వర్గాల నేతలు రాహుల్ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. పార్టీలో నెలకొన్న విభేదాలపైనా సమావేశంలో చర్చ జరిగిందట.
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకాన్ని తప్పుపడుతూ సంచలన కామెంట్లు చేసిన ఎంపీ కోమటిరెడ్డి కొంత కాలంగా కూల్ అయ్యారు. రేవంత్ రెడ్డితోనూ సఖ్యతగానే ఉంటున్నారు. తాజాగా రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన సమావేశంలో మాత్రం కోమటిరెడ్డి గట్టిగా తన వాయిస్ వినిపించినట్లు తెలుస్తోంది. చర్చలో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారట.
ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా… ముందుగానే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని ఆయన అడిగినట్లు సమాచారం. ఇందుకు ఉదాహరణగా ఆయన పెద్దపల్లి నియోజకవర్గానికి విజయరమణారావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన విషయాన్ని వెల్లడించారు. దీనిపై పార్టీలో పెద్ద దుమారమే రేగింది. విజయరమణారావు, రేవంత్ రెడ్డి టీడీపీలో చాలా కాలం కలిసి పని చేశారు. అందుకే ఆయన పేరును ప్రకటించారనే విమర్శలు వచ్చాయి.
కాంగ్రెస్ ను టీడీపీగా మార్చేస్తున్నారంటూ మరికొందరు నేతలు రాహుల్కు చెప్పారు. ఇదే విషయాన్ని రాహుల్ సమావేశంలో కోమటిరెడ్డి ప్రస్తావించాడట. మిగిలిన వారి లాగే తాను కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలా? అంటూ ఆయన పార్టీ కీలక నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలకు వెంటనే పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ స్పందించారు. అలాంటిదేమీ లేదని సర్ది చెప్పారట. ఇప్పటిదాకా ఏ ఒక్కరికి కూడా టికెట్ ప్రకటించలేదని చెప్పిన ఠాగూర్.. పార్టీ అధిష్ఠానమే అభ్యర్థులను ఖరారు చేస్తుందని వెల్లడించారు. దీంతో కోమటిరెడ్డి శాంతించినట్లు తెలుస్తోంది.