తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది. రెండు పార్టీల మధ్య పోరాటంతో వచ్చే ఎన్నికలు లేదా ఎన్నికల తర్వాత కొత్త రకం పొత్తులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రాకుండా చూసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. తాజాగా కాంగ్రెస్ యువ నేత ఈ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు.
సోమవారం సాయంత్రం రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంతో పాటు ఉద్యమ కార్యాచరణ, భవిష్యత్ పొత్తులపై టీపీసీసీ నేతలకు రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్, ఎంఐఎంలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారట. సమావేశంలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటని రాహుల్ ను నేతలు అడిగారు. దీనికి సమాధానంగా రాహుల్ ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ ను తెలంగాణ నేతలకు రాహుల్ పరిచయం చేశారు. తెలంగాణ, కర్ణాటక వ్యవహారాలను సునీల్ చూస్తారని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీల్ ఎన్నికల వ్యూహకర్త కాదని… కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పారు.
అందరం కలిసి పని చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గాల్లో పని చేసే నాయకులకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని రాహుల్ చెప్పారు. క్రమశిక్షణతో నాయకులందరూ కలిసిమెలిసి పని చేయాలని సూచించారు.