తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళి సై మధ్య వార్ జరుగుతోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన తమిళి సై కేంద్రం పెద్దలను కలిశారు. ప్రొటొకాల్ వ్యవహారం వాళ్ల ముందుంచారు. కేసీఆర్ సర్కార్ తీరుపై నివేదిక ఇచ్చారు. కేసీఆర్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిక్కుల్లో పడుతున్నట్లు తెలుస్తోంది. సీఎస్ సోమేశ్ కుమార్‌పై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
గతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బంధోపాధ్యాయ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేశారు. చివరకు ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన సమయంలోనూ సీఎం చెప్పినట్లే నడుచుకున్నారు. మమతా బెనర్జీ ఆడించిన రాజకీయ క్రీడలో పావుగా మారి సమస్యలు కొని తెచ్చుకున్నారు.
ఆయన రిటైర్మెంట్ కు రెండు రోజుల ముందు డిపార్టుమెంటు అఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఇచ్చిన పొడిగింపు కాలాన్ని రద్దు చేసి రీకాల్ చేసింది. అయితే మమతా బెనర్జీ ఆయన్ని మూడేళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా నియమించారు. కానీ ఇప్పటికీ కూడ ఆయన సర్వీస్ నిబంధనలకు సంబంధించిన చిక్కుల నుంచి పూర్తిగా బయట పడలేదు.
సోమేశ్ కుమార్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేస్తుందా అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ను ఢిల్లీ పిలిపించిన సందర్భంలో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనలను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి సోమేశ్ కుమార్ ఆంధ్రా క్యాడర్ అదికారి. కాబట్టి ఆయన్ని వెనక్కి పిలిపించేందుకు సీఎం ముందస్తు అనుమతి కూడా అవసరం ఉండక పోవచ్చు. ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.