వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం పదవి చేపట్టి మూడేళ్లవుతున్నా ఇంకా నిర్ణయాల్లో తడబాట్లు తప్పడం లేదు. మాట తప్పం…మడం తిప్పబోమంటూ పలికిన గంభీర పలుకులు ఒక్కొటొకటిగా గాలికి కొట్టుకుపోతున్నాయి. ఇప్పటిదాకా అన్నీ యూ టర్న్‌లే. చివరకు మంత్రి వర్గ ఏర్పాటు సమయంలో ప్రకటించిన నిర్ణయాన్ని కూడా అమలు చేయలేని దుస్థితిలోకి సీఎం జగన్ జారిపోవడం విశేషం. సీనియర్ల ఒత్తిడికి తట్టుకోలేక కొత్త పాత కలయికతో కూడిన మంత్రి వర్గ ఏర్పాటునకు తలాడించాల్సి వచ్చింది.
పది మంది పాత మంత్రులతోపాటు కొత్తగా 15 మందితో నూతన మంత్రి వర్గ ఏర్పాటునకు ఫైనల్ చేశారు. పాతవాళ్లలో బొత్స, సీదిరి అప్పలరాజు, విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, అంజాద్ బాషా, బుగ్గన, గుమ్మునూరి జయరాం, పెద్దిరెడ్డి, నారాయణ స్వామి ఉన్నారు.
కొత్తగా ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్నాధ్, దాడిశెట్టి రాజా, పూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, బొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాని గోవర్థన్‌రెడ్డి, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, తిప్పేస్వామిని మంత్రి వర్గంలోకి ఖరారు చేశారు.
ఇక పాతవారిలో కొడాలి నానికి స్టేట్ డెవలప్మెంటు బోర్డు చైర్మన్‌గా కేబినెట్ హోదా కల్పిస్తారని భావిస్తున్నారు. ప్రణాళికా సంఘం చైర్మన్‌గా మల్లాది విష్ణు, డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశమిస్తే కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు ఉంటుందని సీఎం జగన్ నిర్ణయించి ఉండొచ్చు.
మరోవైపున తనకు అవకాశం ఇవ్వలేదని నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కత్తులు నూరుతున్నాడు. మాచర్లలో పిన్నెల్లికి అవకాశం ఇవ్వలేదని మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీపీ, జడ్పీటీసీలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు, ఇతర సమస్యలను సీఎం జగన్‌ను మానసికంగా బాగా కుంగదీసినట్లుంది. దీనికి తోడు మళ్లీ పాత మంత్రులతో వైరం పెంచుకోవడం ఇష్టంలేక కొంత మెత్తబడినట్లు తెలుస్తోంది. కనీసం ముందుగా తీసుకున్న నిర్ణయానికీ కట్టుబడలేక పోయారు.
ఇప్పుడు ఖరారు చేసిన జాబితాలో ఒకటీ అరా మార్పు చేసినా అలకలను ఆపడం సాధ్యం కాకపోవచ్చు. ఈపాటికే ప్రజల నుంచి పెరుగుతున్న వ్యతిరేకత, కార్యకర్తల ఉక్రోషంతోపాటు ఇప్పుడు ఈ అసంతృప్తులనూ ఎదుర్కోక తప్పదేమో.