మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణ తర్వాత వైసీపీలో అసమ్మతి భగ్గుమంది. సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరి అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఏకంగా సీఎం జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
ఈ ఘటనలు వైసీపీని దిమ్మ తిరిగేట్లు చేశాయి. జగన్ మాటే వేదమని ఇంతకాలం చెప్పుకున్న నేతలు… జగన్ ను ధిక్కరిస్తూ రోడ్లపైకి రావడం సంచలనంగా మారింది.
వైసీపీలో రేగిన కేబినెట్ పదవుల చిచ్చు చల్లార్చడంపై జగన్ సర్కార్ దృష్టి పెట్టింది. అసంతృప్తి నేతలను బజ్జగించేందుకు కీలక పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. తనకు మరోసారి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆగ్రహంగా ఉన్న బాలినేని పిలిపించుకుని మరీ సీఎం జగన్ మాట్లాడారు.
దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. సీఎంతో భేటీ తర్వాత బాలినేని చల్లబడినట్లు సమాచారం. అయితే బాలినేనికి కీలక పదవి కట్టబెడతానంటూ ముఖ్యమంత్రి జగన్ మాట ఇచ్చినట్లు సమాచారం.
సీఎం జగన్ ఈ నెల 22న ఒంగోలులో పర్యటించనున్నారు. నవరత్నాల్లో భాగంగా సున్నా వడ్డీ పథకం కింద మూడో ఏడాది డ్వాక్రా మహిళల ఖాతాలకు ఆ రోజు నగదు విడుదల చేస్తారు. తాజా మాజీ మంత్రి బాలినేని చొరవతో గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ఎన్నారైలు ఏర్పాటు చేస్తున్న ఐటీ కంపెనీని సైతం అదే రోజు జగన్ ప్రారంభిస్తారు. బాలినేనికి కీలక పదవి ఇస్తున్నట్లు ఆ రోజే ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉంది