పోలవరం పనులు ఇక పరుగులు పెట్టనున్నాయి. ప్రాజెక్ట్ యుద్ధప్రాతిపదిక పూర్తి కావడానికి సంపూర్ణ సహకారం అందించాలని సంబంధిత శాఖలను కేంద్రజల్‌శక్తి శాఖ ఆదేశించింది. కేంద్ర ఆర్థిక, అటవీ, పర్యావరణ, గిరిజన సంక్షేమ శాఖలు, పీపీఏను ఈమేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాలను వారి ఖాతాల్లో జమచేసిన తరహాలోనే పోలవరం నిర్వాసితుకు పరిహారం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు.
కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన 2014లో ఏర్పాటైన పీపీఏ పాలక మండలి తొలి సమావేశం వర్చువల్‌గా జరిగింది. భేటీలో ఏపీ తరపున సీఎస్ సమీర్‌శర్మ, జలవనరుల శాఖ అధికారులు , తెలంగాణ తరపున ఈఎన్సీ మురళీధర్ పాల్గొన్నారు.
తొలుత పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ వివరించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై పాలక మండలి సంతృప్తి వ్యక్తం చేసింది.
పోలవరం పనుల్లో జాప్యానికి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోకపోవడమేనని పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అన్నారు. దీనిపై జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని గుర్తు చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించడం, రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరగకుండా చూడాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ తొలి దశలో నీటిని నిల్వ చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తొలిదశలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు. సీఎం జగన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తామని పంకజ్‌కుమార్ చెప్పారు. పోలవరం తొలిదశను పూర్తి చేయడానికి వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్. ప్రాజెక్టు పనులకు నిధుల కొరత తలెత్తకుండా చూస్తామని పంకజ్‌కుమార్ స్పష్టం చేశారు.