జనసేనానికి జ్ఞానోదయమైనట్లుంది. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే వచ్చే నాలుగు ఓట్లు కూడా పడవని నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయంపై పార్టీ క్యాడర్ నుంచి ఆయనకు అనేక విజ్ఞప్తులు వచ్చాయట. కలిసొస్తే టీడీపీని కలుపుకుపోవడం.. లేకుంటే ఒంటరిగానే ముందుకు సాగాలని కార్యకర్తలు సూచించారు. దీంతో ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి తొందరపడకూడదని పవన్ కల్యాణ్ నిర్థారించుకున్నారట. ప్రజా సమస్యలపై పోరాడే సమయంలో కలిసొచ్చే పార్టీలతోనే కలిసి సాగాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ వపన్‌కు సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలకు పట్టని కౌలు రైతుల సమస్యలపై జనసేన గళం విప్పింది. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు తమ వంతు రూ. లక్ష చొప్పున సాయం చేస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాలో 80 రైతు కుటుంబాలకు, అనంతపురం, కర్నూలు జిల్లాలోని 140 కుటుంబాలకు జనసేనాని సొంత డబ్బు ఇస్తున్నాడు. ప్రభుత్వం నుంచి రూ.7 లక్షల చొప్పున పరిహారం అందే వరకూ పోరాడతామని ఈసందర్భంగా పవన్ కల్యాణ్ భరోసానిచ్చారు.
ఈ క్రమంలోనే బీజేపీతో కలిసి ముందుకెళ్తే వచ్చే నష్టాల గురించి కూడా అంచనా వేస్తున్నారు. నిత్యం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూపోతున్నారు. ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని జనసైనికులు వాపోతున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు ఆయుపట్టుగా నిలుస్తోన్న విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలోనూ కేంద్రం మొండిగా ముందుకెళ్లడంతో జనసేన నేతలకు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డ సామెతయింది.
రాష్ట్రంలో బీజేపీ ఏం చేసినా ఊడేది లేదు.. పోయేది లేదు. ఈసారి అసెంబ్లీలో గణనీయమైన సీట్లు తెచ్చుకోకుంటే జనసేన పార్టీనే మిగలదు. ఈవాస్తవాన్ని గుర్తించినట్లుంది. ఎన్నికల నాటికి బీజేపీకి కటీష్ చెప్పేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీడీపీ ఇంకా గోడ మీద పిల్లివాటంగానే ఉంది. తాడోపేడో తేల్చుకోవాలని జనసేన అల్టిమేటం ఇవ్వాలనుకుంటుందట.
బీజేపీ లేకుండా టీడీపీ, జనసేన కలిస్తే మిగతా వామపక్షాలు, కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశమున్నట్లు జనసేన అంచనా వేస్తోంది. ఏదిఏమైనా జనసేన ఇదే ఒరవడితో ప్రజా సమస్యలపై పోరుబాటను ఎంచుకుంటే ప్రజాభిమానానికి ఢోకా ఉండదు.