ఒకప్పుడు వంట గ్యాస్ బండ సబ్సిడీ ధరతో ప్రజలకు చేరేది. సబ్సిడీని నగదు రూపంలో వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. జనం నమ్మారు. రాన్రాను సబ్సీడీ తరిగి పోయింది. ఇప్పుడు సిలిండర్ రేటు వెయ్యి దాటింది. సబ్సిడీ 12 రూపాయలు వస్తుంది. ఇదే మాదిరిగా ప్రజల ఆహార భద్రతను దెబ్బతీయాలనుకుంటున్నారు. చౌక బియ్యానికి ఎసరు పెట్టారు. బియ్యానికి బదులు నగదు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. మళ్లీ సేమ్ టు సేమ్. గ్యాస్ మాదిరిగానే.
ఏదైనా ఓ వ్యవస్థను నాశనం చేయాలంటే ముందుగా దానిపై పిచ్చి కుక్క ముద్ర వేయాలి. అదొక పనికిమాలిన వ్యవస్థగా ప్రజల్లో నానేట్లు చేయాలి. అప్పుడు దాన్ని నాశనం చేయడం తేలిక. ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లను ఇలాగే చేశారు. ఇప్పుడు సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ వంతు వచ్చింది.
సగటు ప్రజలకు ఆహార భద్రత కల్పించే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోవాలని చూస్తున్నాయి. మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేయాలని భావిస్తున్నాయి. ఇది దేశ సార్వ భౌమత్వానికి పెను సవాల్ విసరడం లాంటిదే.
ఇంట్లో ఎలుకలు పడ్డాయని ఎవరైనా ఇల్లు తగలబెట్టుకుంటారా ! ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నది అదే. ప్రజా పంపిణీ వ్యవస్థ అవినీతి అక్రమాలమయమైందంటున్నారు. చౌక బియ్యం ఎవరూ తినడం లేదని చెబుతున్నారు. అందుకే బియ్యానికి బదులు నగదు ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి.
ఇది పైకి కనిపించే ఓ అందమైన అబద్దం. వాస్తవానికి రేషన్ ద్వారా ప్రజలు తినే సన్న బియ్యం ఇస్తే బయట మార్కెట్లో 50 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరముండదు. పేదలకిచ్చే బియ్యం కదా అని ఉక్కి పోయినవి, పురుగు పట్టినవి, దుడ్డు బియ్యం ఇస్తున్నారు. వీటిని ప్రజలు తీసుకోకపోవడంతో పక్కదారి పడుతున్నాయి. ప్రజల సబ్సిడీ సొమ్ము బ్లాక్ దందా వ్యాపారుల పాలవుతోంది.
రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులున్నాయి. అంటే 90 శాతం ప్రజలకు తెల్ల కార్డులున్నాయి. వీళ్లంతా పేదలేనా ! బయట మార్కెట్లో బియ్యం కొనుక్కోలేని నిరుపేదలా ! మెడపై తలకాయ లేని ప్రభుత్వాలు ప్రతీ సంక్షేమ పథకానికి తెల్ల కార్డును ప్రామాణికం చేశాయి.
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ల్యాండ్ లార్డ్స్, ధనిక రైతులూ తెల్ల కార్డులు పొందారు. వీళ్లెవరూ కార్డుపై తలకు వచ్చే 5 కిలోల బియ్యం తీసుకోరు. 40 శాతం మంది పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు బియ్యం ఎలా ఉన్నా తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు రైస్ మిల్లర్లు, బియ్యం అక్రమ వ్యాపారులు కలిసి రేషన్ బియ్యం మాఫియా మారారు. ఇవన్నీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో బాహాటంగా జరిగేవే. కింద నుంచి పై దాకా ముడుపుల బాగోతం గురించి అటెండరు నుంచి సంబంధిత మంత్రి వరకు తెలుసు.
అయినా ఎవరూ ఏమీ తెలయని పత్తిత్తులు మాదిరిగా నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారు. కార్డు దారులకు కిలో బియ్యానికి 12 నుంచి 15 రూపాయలు ఇస్తే చాలంటున్నారు. ప్రజలు అప్రమత్తమై ఆహార భద్రతను కాపాడుకోకుంటే ఇది మరో గ్యాస్ సబ్సిడీ పథకంలా మారిపోతుంది.