ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మండుటెండలతో జనాలు నివాసాల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇంట్లోనే ఉంటే ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అటు ఇంట్లో ఉండలేక ఇటు బయట కాలు పెట్టలేక అల్లాడుతున్నారు.
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల వల్ల ఉక్కపోత నుంచి ప్రజలు ఉపశమనం పొందే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో మెరుపులు, ఉరుములు సంభవించే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రావణి వెల్లడించారు.
రానున్న 24 గంటల్లో హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చిరుజల్లులు కురిసే అవకాశముంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు రోజులు అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు శ్రావణి వివరించారు.