ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో వివాదం రాజుకుంటోంది. ఏపీ నుంచి వచ్చే వరి ధాన్యం లారీలను తెలంగాణలోకి అనుమతించడం లేదు. దీంతో సరిహద్దులో ధాన్యం లారీలు భారీగా ఆగిపోయాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి చెక్‌పోస్టు వద్ద ఏపీ లారీలను తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో డ్రైవర్లు పడిగాపులు పడుతున్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం లారీలు తెలంగాణలోకి ప్రవేశించడానికి వీలులేకుండా 51 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ-రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలను నిలిపేస్తున్నారు.
అలాగే నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి వద్ద, నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ కొత్త వంతెన వద్ద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కోదాడ మండలంలోని రామాపురం క్రాస్‌రోడ్డులో చెక్‌పోస్టు వద్ద రెండు లారీలు, ట్రాక్టర్లను తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం క్వింటా ధాన్యానికి 1960 చెల్లిస్తుందని ప్రకటించడం, ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తక్కువ ధరకు ధాన్యం లభిస్తుండడంతో ఇక్కడి వ్యాపారులు అక్కడ కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే సూర్యాపేట, నకిరేకల్‌కు వస్తున్న లారీలను, జగ్గయ్యపేట నుంచి కోదాడ మీదుగా వస్తున్న లారీలు..ట్రాక్టర్లను పోలీస్, రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారు.
ఏపీ నుంచి తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం రానిచ్చేది లేదని అధికారులు ప్రకటించారు. ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం ముత్తగూడెం చెక్‌పోస్టు వద్ద, మధిర నియోజవకర్గంలోని మధిర, బోనకల్, ఎర్రుపాలెం చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయలేదు.