తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. జిల్లాలు చుట్టేస్తూ కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఆయన స్పీడుకు పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సభ్యత్వ నమోదు కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బావుంది. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ లో మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయి.
సుమారు వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ దళంలో ఈపాటికే చేరిపోయారు. దౌల్తాబాద్ సర్పంచ్ శిరీష్, మండల నాయకుడు వెంకటేష్‌తో సహా వంద మంది కాంగ్రెస్ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి వీరికి అండగా నిలుస్తుండడంతో చేరికలు జోరందుకున్నాయి.
టీ కాంగ్రెస్ వ్యవహారాల్లో రాహుల్ గాంధీ నేరుగా జోక్యం చేసుకొని అసంతృప్త నేతలను బుజ్జగించడంతో రేవంత్ రెడ్డి జోరు పెంచారు. తాజా పరిణామాలు ఆయన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. 2009 నుంచి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. తదనంతర పరిణామాలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్‌గా ఎదిగారు.
కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన కొడంగల్ కు దూరమయ్యారు. ఎంపీగా అటు ఢిల్లీలో, పీసీసీ చీఫ్ గా ఇటు హైదరాబాద్ లో బిజీ బిజీగా గడుపుతున్న రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి పైనే దృష్టి సారించేందుకు సమయం సరిపోవడంతో లేదు. దీంతో కొడంగల్ కు సరిపడ సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డి కాంగ్రెస్ నేతలకు వల వేస్తున్నారు. దీన్ని రేవంత్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.