సీఎం వైఎస్ జగన్ గతంలో చంద్రబాబులా ఏది చేసినా పండగలాగే చేస్తారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద నగదు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,02,16,410 అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 1,261 కోట్ల వడ్డీని సీఎం జగన్ ఓ బటన్ నొక్కి జమ చేశారు. దీంతో మొత్తం మూడేళ్లలో సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చినట్లుగా గుర్తు పెట్టుకోవాలని సీఎం నొక్కి వక్కాణించారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాల్లేవు.
ఇలా సంక్షేమ పథకాలు ఇస్తుంటే టీడీపీతోపాటు జత కలిసిన మీడియా దుష్ట చతుష్టయం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నట్లు చెప్పారు. అభివృద్దికి అడ్డు పడుతున్నట్లు సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆ దుషట చతుషటయంతో పోరాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న వీళ్లంతా నిజంగానే అడ్డుపడ్డారా.. లేక వీళ్లను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుతున్నారో ఓ సారి పరిశీలించాలి.
సీఎం మీటింగ్ నుంచి మహిళలు ఇంటికెళ్లగానే కాసేపు కాళ్లు వత్తుకుంటూ చర్చల్లో మునిగి తేలతారు. రూ.70 వంటనూనె రూ.200 ఎందుకు దాటిందో చెబుతారు. రోజూ వాళ్లాయన కూలీ పనులు చేసిన సొమ్ములో తాగుడుకు ఎంత తగలేస్తున్నాడో లెక్కలతో వల్లెవేస్తారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇతర నిత్యావసరాలు ఎలా చుక్కలు చూస్తున్నాయో పల్లుపోకుండా చెబుతారు.
ఇంటిపన్నులు పెంచడం వల్లే తమ ఇంటి అద్దె రూ.3 వేల నుంచి ఐదు వేలకు పెరిగినట్లు ముక్కు చీదుతూ కన్నెర్ర జేస్తారు. రూ.400 ఉన్న వంట గ్యాస్ వెయ్యికి ఎందుకు పెరిగిందో వాళ్లదైన భాషలో బాగా అర్థమయ్యే ట్లు వెల్లడిస్తారు. పెరిగిన కరెంటు చార్జీల గురించి అసలు చర్చ అనవసరం. ఇప్పుడు ఇచ్చిన సున్నా వడ్డీ ఎటో పోతుంది. గత ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది.
ఒంగోలు నగరంలోని సుమారు 25 వేల పేద కుటుంబాలకు నవరత్నాల కింద ఇంటి పట్టాలు, గృహ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. యరజర్ల కొండ ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. చదును చేసి ప్లాట్లు వేయడానికి సుమారు రూ. 20 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించారు.
పట్టాలు ఇవ్వాల్సిన తరుణంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల అనుచరుడు కోర్టులో కేసు వేశాడు. ఈ భూమి గతంలో ఖుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీకి మైనింగ్ కోసం లీజుకు ఇచ్చినట్లు హైకోర్టును ఆశ్రయించాడు. ఇది జరిగి సుమారు రెండేళ్లు కావొస్తోంది.
గతంలో మైనింగ్ లీజుకు ఇచ్చిన భూమిని పేదల ఇళ్ల పట్టాలకు ఎలా ఇచ్చారో తెలీదు. తప్పు చేసిన వీఆర్వో నుంచి ఆర్ఐ, తహసిల్దారు, ఆర్డీవో, జేసీ, కలెక్టరుదాకా ఎవరిపైనా చర్యల్లేవ్. దీనిపై గౌరవ సీఎం అసెంబ్లీలో నానా హైరానా చేశారు. అప్పటిదాకా ఆ కార్యకర్త పేరు ఆ పార్టీ వాళ్లకే సరిగ్గా తెలియదు. ఎన్నికల సీజనొచ్చేదాకా ఇళ్ల పట్టాలను ఊరిస్తుంటారా..! సేమ్ టు సేమ్ గత ప్రభుత్వం లాగే. ఒకరినొకరు అనుకరించుకుంటూ వెళ్తే ప్రజలకు అర్థం కాదా సార్ !