కౌలు రైతులు. అధికార విపక్షాలకు గిట్టని ఓ పదం ఇది. ఇవ్వాళ ఉంటారు. రేపు మరొకరొస్తారు. భూ యజమానే మాకు ముఖ్యం. వాళ్లే గ్రామాల్లో ఓట్లేయించగలరు. అలాంటి వాళ్లతో వైరమెందుకు పెట్టుకోవాలి ! అందుకే కౌలు రైతులంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షానికి ఆసక్తి ఉండదు. అలాంటి కౌలు రైతుల కోసం ఓ రాజకీయ పార్టీ నడుం బిగించడం విశేషమే. ఇప్పటిదాకా వామపక్ష పార్టీలు కౌలు రైతులకు అండగా నిలిచాయి. ఇప్పుడు జనసేనాని పవన్ తన గొంతుకను ఇచ్చారు.
కౌలు రైతులకు గత ప్రభుత్వంలోనూ.. అంతకముందు కష్టాల్లేవా అని వైసీపీ సానుభూతిపరుడైన మిత్రుడు ప్రశ్నించాడు. వ్యవసాయంలో మిగులుతో కొన్ని కుటుంబాలు పంటల సేద్యాన్ని వదిలేశాయి. వాళ్ల వారసులు ఇతర రంగాల్లో సెటిలయ్యారు. ఉన్నత చదువులతో డాలర్ల పంట సాగు చేస్తున్నారు. వ్యవసాయం చేసే తరం లేదు. అలా రెండుమూడు దశాబ్దాల నుంచి కౌలు సాగు పెరిగింది. ఇక్కడ నుంచే కౌలు రైతుల సమస్యలు తీవ్రమయ్యాయి.
కౌలు ధరలు అమాంతం పెరిగాయి. ప్రభుత్వ అజమాయిషీ లేదు. భూ యజమాని ఇష్టం. వ్యవసాయ యాంత్రీకరణతో కూలీలకు ఉపాధి పోయింది. అనివార్యంగా కౌలు రైతుల అవతారమెత్తారు. ఒకప్పుడు పండిన పంటలో ఇంత భాగమని కౌలు ఉండేది. ఇప్పుడు అలా కాదు. పంట పండినా పండకున్నా ముందుగా కౌలు చెల్లించాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 70 నుంచి 80 శాతం పంటలను కౌల్దార్లే సాగు చేస్తున్నారు.
గతంలో ఉన్న ఏపీ కౌల్దారీ చట్టంలో కొన్ని లోపాలున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని సవరించకపోగా మరింత జఠిలం చేసింది. నేడు కౌలు రైతు ప్రభుత్వ రికార్డుల్లో లేడు. భూయజమాని ఇచ్చిన తన స్నేహితులు, బంధువుల పేర్లుంటాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండదు. పంట దెబ్బతింటే నష్టాలు మూటగట్టుకొని మళ్లీ బేల్దారీ పనికి పోవాలి. ఇలా ఈ మూడేళ్లలో సుమారు 3 వేల మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మొత్తం 56 లక్షల రైతు కమతాల్లో సుమారు 40 లక్షల మంది కౌలు రైతులే ఉన్నారు. ఇందులో కనీసం సెంటు భూమి కూడా సొంతం లేని వాళ్లు దాదాపు 20 లక్షల మంది ఉంటారు. వీళ్లంతా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలే. మిగతా వాళ్లు పాక్షిక కౌల్దారులుగా ఉన్నారు. అంటే మొత్తం కౌలు రైతుల ఓట్లు సుమారు కోటికిపైనే ఉంటాయి.
వాళ్లు కన్నెర్రజేస్తే చాలు. ఏ పార్టీ అయినా నామ రూపాల్లేకుండా పోతుంది. ఇప్పుడే అసలు కథ మొదలైంది. కౌలు రైతుల పక్షాన జనసేనాని నిలిచి అధికార విపక్షాల వెన్నులో చలి పుట్టిస్తారా లేదా అనేది ఆయన పోరాట పటిమపై ఆధారపడి ఉంటుంది. విష్ యూ గుడ్ లక్ భయ్యా !