ఆ చల్లని సముద్ర గర్భం.. దాచిన బడబాలనమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో !!ఆ చల్లని!!
భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో
శ్రమ జీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో !! ఆ చల్లని!!
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
అణగారిన అగ్ని పర్వతం కనిపించని లావా ఎంతో
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో !! ఆ చల్లని!!
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో
కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో
భరతావని బలపరాక్రమం చెర వీడేది ఇంకెన్నాళ్లో !!ఆ చల్లని!!
– దాశరధి కృష్ణమాచార్య