పురాణాల్లో జూదమంటే పాచికలాట. దానిపై పందేలు వేసేది. తర్వాత పేకాటను జూదమనేవాళ్లు. ఇప్పుడు అదీ ఇదీ అన్లేదు. జూదానికి మరో రూపం బెట్టింగ్. కవిత్వానికి కాదేదీ అనర్హం అన్నట్లు జూదానికీ, బెట్టింగ్‌కు అనర్హమైంది ఏదీ కనిపించడం లేదు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఆశలతో ఈ రెండు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ ఆధునిక జూదం లేదా బెట్టింగ్‌లతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చివరకు బలవన్మరణాలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ వీటి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే..
నలుగురు యువకులు టీ స్టాల్ దగ్గర చిట్ చాట్ చేసుకుంటున్నారు. పక్కనే టీ తాగుతూ వాళ్ల సంభాషణను వింటున్న సమయంలో అనేక కొత్త విషయాలు తెలిశాయి. నేడు దేశంలో ఇన్ని రకాలుగా జూదం నడుస్తుందా అనిపించింది. అందులో మొదటి యువకుడు మాట్లాడుతూ అసలు ఈ బెట్టింగులు ఎవడు కనిపెట్టాడో కానీ కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
వెంటనే రెండో యువకుడు గొంతు విప్పాడు. బెట్టింగ్ అనేది ఎందులో లేదు చెప్పు ! ఒకప్పుడు ఎంతో ఆసక్తిని రేకెత్తించే క్రికెట్ ఇప్పుడు బెట్టింగులకే పరిమితమైన ఆటగా మారింది. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపైనా బెట్టింగులే. చివరకు కాలేజీల్లో తెగ బలిసినోళ్ల పిల్లలు పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తాయనే దానిపైనా బెట్టింగులు పెట్టుకుంటున్నారు.
ఇంకా బైక్ రేసులపై బెట్టింగులు, మద్యం ఎంత తాగుతారనే దానిపై బెట్టింగులు. మద్యం తాగిన తర్వాత కార్ డ్రైవింగ్ పై బెట్టింగులు నడుస్తున్నాయి. అసలు బెట్టింగులు లేనిదెక్కడంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు.
ఇవన్నీ పెద్దపెద్దోళ్ల స్థాయిలో జరుగుతున్నాయంటే డబ్బు ఎక్కువై చేస్తున్నారనుకోవచ్చు. పల్లెల్లోనూ ఇవి కొనసాగుతున్నట్లు మూడో యువకుడు వెల్లడించాడు. పేకాటతో కాపురాలు గుల్లవుతున్నాయి. ఇందులోనూ లోనా బయటా అంటూ పావుగంటలో వేలు.. లక్షలు పోగొట్టుకుంటున్నారు.
ఇది చాలదన్నట్లు హైవేపైకి చేరి నంబర్లాట ఆడుతున్నారు. ఒకప్పుడు పల్లెల్లో కోడి పందేలు, అష్టా చెమ్మా, మేక–పులి ఆటల్లో రూపాయో రెండు రూపాయలో బెట్టింగులు పెట్టుకునేది. ఇప్పుడవన్నీ కనుమరుగయ్యాయి. మొబైల్లో పేకాట. లేకుంటే క్రికెట్ బెట్టింగ్స్ జోరు మరింత పెరిగింది.
ఈ జూదం లేదా బెట్టింగుల వ్యసనం సంపన్నులు, రాజకీయ నాయకులు, అక్రమార్జన కుటుంబాలతో మొదలైంది. నేడు రోజువారీ కూలీనాలీ చేసుకునేటోళ్లకూ చేరిందని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకప్పుడు రెండెకరాల రైతు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేసేది. ఇప్పుడు సెంటు భూమి లేకున్నా పాతిక ఎకరాలు కౌలుకు తీసుకొని శనగ సాగు చేస్తున్నారు. సక్రమంగా పండితే చేతికి రెండు ఉంగరాలు వస్తాయి. పోతే ఊరొదిలి పోవడమే.
చేతిలో చిల్లిగవ్వ లేకున్నా పొగాకు, మిర్చి లాంటివి పెద్ద ఎత్తున సాగుకు దిగుతున్నారు. కాస్త మిగిలితే మీసం మెలేస్తున్నాడు. లేకుంటే కనిపించకుండా పోతున్నారు.. వీటికి అంతమెప్పుడో అంటూ ఆ యువకుడు వాపోయాడు. వాళ్ల చర్చల్లో పాలుపంచుకోవడానికి నా దగ్గర మాటల్లేవు. అందుకే కొన్ని అక్షరాలు కొసిరా. ఈ జాడ్యానికి విరుగుడు పని సంస్కృతి మాత్రమే. అది ఎప్పటికి సాధ్యమవుతుందో !