సమాజ గతిని మార్చేది ఉపాధ్యాయులే. ఏదైనా వాళ్లతో చర్చించడాన్ని గౌరవంగా భావిస్తారు. అలాంటిది వాళ్లకు ఇచ్చిన హామీ గురించి అడుగుతుంటే ఎదురు దాడికి దిగడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు సీఎం జగన్ హామీ నిచ్చారు. హామీ అమలు గురించి అడిగితే ఎదురు దాడికి దిగుతూ అణచివేతకు పాల్పడడం హేయం.
ఉపాధ్యాయులకు సీఎం జగన్ ఇచ్చిన సీపీఎస్ రద్దు హమీ గురించి అడుగుతున్నారు. అది తమ పరిధిలో లేదు.. అవగాహన లేకుండా సీఎం హామీ ఇచ్చినట్లు గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడించారు. సాంకేతిక పరమైన చిక్కులున్నట్లు చెప్పారు. అదే విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావాలి. దీనికి భిన్నంగా కక్షపూరిత చర్యలకు పూనుకోవడాన్ని ఏమంటారు !
ఒకప్పుడు బతకలేని బడిపంతులు కావొచ్చు. ఇప్పుడు సంఘటిత శక్తిగా ఉపాధ్యాయ లోకం ఎదిగింది. ప్రజల ఆలోచనలను మలచగల శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంది. పిల్లలకు పాఠాలు బోధించడమే కాదు. గతి తప్పిన సమాజాన్ని గాడిలో పెట్టే మేథావులు. విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టాలంటే ముందుగా ఉపాధ్యాయల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
దీనికి భిన్నంగా కేంద్రం బలవంతంగా రుద్దిన నూతన విద్యావిధానాన్ని అమలుకు ప్రభుత్వం పూనుకుంది. మాధ్యమం విషయంలోనూ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. అమ్మ ఒడిని ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయాలన్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
నిన్నమొన్నటి పీఆర్సీ విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయానికి ఉపాధ్యాయులు అంగీకరించలేదు. రోడ్డు మీదకొచ్చి ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. పోలీసు బలగాలతో నిర్బంధించడం.. నిరసనలను అణచివేసి అత్యంత క్రూరంగా వ్యవహరించింది. మళ్లీ ఇప్పుడు సీపీఎస్ రద్దు హామీ అమలు కోసం ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులు సోమవారం చలో తాడేపల్లికి పిలుపునిచ్చారు.
కనీసం ఇప్పుడైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని చర్చలకు పిలవాల్సింది. చర్చల ద్వారా ఓ ఆమోద యోగ్య పరిష్కారానికి చొరవ చూపాల్సింది. వీటికి బదులుగా పోలీసులతో నిర్బంధించడం, మరో నెలపాటు సెలవులు రద్దు చేయడం, ఇంకా అరెస్టులదాకా వెళ్లడం ప్రభుత్వ మొండి వైఖరిని వెల్లడిస్తోంది. సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వర్గంతో తలపడి ఏం సాధిస్తారో తెలీడం లేదు పరిస్థితులు ఇలాగా కొనసాగితే వైసీపీ సర్కారు పుట్టి మునగడం ఖాయం.