“ఇవన్నీ జనానికి అర్థమయ్యే నాటికి కరెంటు మన చేతుల్లో ఉండదు సార్ ! ఒక్కో నాయకుడు ఒక్కో సబ్ స్టేషన్ ఎత్తుకుంటాడు. సెల్ రీచార్జ్ మాదిరిగా కరెంటుకూ ముందుగా డబ్బు కట్టాల. సమయానికి డబ్బు చేతిలో లేకుంటే చీకట్లో చచ్చామే ! ” అంటూ లైన్ మేన్ జీవం లేని నవ్వు నవ్వేశాడు. మండుటెండలో బైక్ మీద వచ్చి చల్లని చెట్టు కిందకు చేరాడు. పని భారం ఎక్కువైంది. ఇష్టమైతే చేయండి. లేకుంటే వెళ్లమంటున్నారు. వీఆర్ఎస్ తీసుకున్నా ఈ ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రాదు. ఏం చేస్తాం సార్. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటూ లైన్ మేన్ చెమట తడుసుకుంటూ వాపోయాడు.
రాష్ట్రంలో విద్యుత్ కొరతపై చర్చల్లోకి వెళితే… బోలెడు విషయాలు బయటకొచ్చాయి. చంద్రబాబు హయాంలోనే విద్యుత్ బోర్డు గొంతు నులిమేశారు. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలుగా విడగొట్టారు. తర్వాత నెమ్మదిగా ఉత్పత్తిని పాతాళానికి తొక్కేశారు. ఇష్టారీతిన ప్రైవేటు ఉత్పత్తి దారులకు అప్పగించేశారు. ఇప్పుడు సరఫరా, పంపిణీ వ్యవస్థలను నొక్కేసేందుకు కుట్ర పన్నారు.
కేంద్ర సర్కారు అదానీతో కలిసి ఏర్పాటు చేసిన సెకీ నుంచే అధిక ధరతో అన్ని రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు చేసేట్లు ఒప్పందాలు జరిగాయి. దీన్ని తెలంగాణ, తమిళనాడుతోపాటు మరికొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. సొంతంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నాయి.
మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం అలవికాని నిబంధనలన్నింటికీ తలూపింది. అందువల్ల ఇక్కడ జెన్కోలను పడుకోబెట్టి అదానీ నుంచి అధిక ధరకు కరెంటు కొంటున్నారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఇక నుంచి బొగ్గు సరఫరా కూడా అంతంత మాత్రమే.
త్వరలో మొదటి దశ కింద ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రిపెయిడ్ మీటర్లు పెడతారు. తర్వాత కమర్షియల్ కనెక్షన్లకు బిగిస్తారు. చివరిగా డొమెస్టిక్ వినియోగదారులకూ రావొచ్చు. అసలు డిస్కంలకు సంబంధం లేకుండా ఉత్పత్తి కంపెనీ నుంచి హెచ్టీ లైన్ల ద్వారా బడా వినియోగదారులకు నేరుగా కరెంటు సరఫరా అవుతుంది.
33కేవీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న సబ్ స్టేషన్లు, వాటి పరిధిలోని హెచ్ టీ లైన్లు, ఇతర ఆస్తులను లీజు పద్ధతిలో ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తారు. వాళ్లు చెల్లించే లీజు సొమ్ముతో డిస్కంల అప్పులను ప్రభుత్వం తీర్చాలి. లీజు ఎంతకాలమనేది ఇంకా స్పష్టత లేదు. విద్యుత్ పంపిణీలోకి బడా కంపెనీలు వస్తాయి. వాటికి జూనియర్ పార్టనర్లుగా లోకల్ లీడర్లుంటారు. అంతే.
ఇదే రోజున సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తం గా ట్రాన్స్కో ద్వారా రూ.3,897 కోట్ల విలువైన పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఎందుకు పెట్టారంటే మెరుగైన విద్యుత్ సరఫరా కోసమని చెబుతున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మితమవుతున్న కోట్ల విలువైన సబ్ స్టేషన్లు, హెచ్ టీ లైన్లను ప్రైవేటుకు అప్పజెప్పేటప్పుడు ఇంకేం చెబుతారో మరి !