ఏదైనా సమయస్ఫూర్తిని ప్రదర్శించడంలో తెలుగు దేశం పార్టీ తర్వాతనే ఎవరైనా. అధికార వైసీపీ ఎన్నికల ముందు పార్టీ కోసం జెండాలు మోసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అపవాదును మూటగట్టుకుంది. ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు పార్టీ పెద్దలను తూర్పారబడుతున్నారు. ఇది గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ఉపక్రమించారు. లోకేష్ ఆధ్వర్యాన ప్రత్యేక కమిటీ వేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
గ్రామస్థాయి పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల పని విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు. వాళ్ల పని ఆధారంగానే పార్టీ తగు విధంగా రియాక్ట్ అవుతుందన్నారు. ఏ పార్టీ కైనా పునాదులు క్షేత్ర స్థాయి కార్యకర్తలే. వాళ్ల క్షేమాన్ని విస్మరించేది లేదన్నారు.
ఈపాటికే సభ్యత్వం తీసుకున్న వాళ్లకు రూ. 2 లక్షల దాకా బీమా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇది గాక లోకేష్ పరిధిలో ఉండే ప్రత్యేక కమిటీ కార్యకర్తల కనీస అవసరాలు తీర్చడానికి కృషి చేస్తుందని చంద్రబాబు వివరించారు.
గతంలో జన్మభూమి కమిటీల పేరుతో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు ప్రభుత్వ పాలనలో జోక్యం కల్పించారు. దానిపై సరైన పర్యవేక్షణ లేక అనేక అవినీతి ఆరోపణలకు జన్మభూమి కమిటీలు నెలవయ్యాయి. చివరకు పార్టీకి ఎనలేని అప్రదిష్టను మూట గట్టాయి. సాధారణ ప్రజలు సైతం ఆ కమిటీలను చీదరించుకునే స్థాయికి చేరాయి.
ఇలాంటి చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పాలనలో ఇటు పార్టీ యంత్రాంగాన్ని, అటు ప్రజల జోక్యాన్ని మరింతగా పెంచేందుకు తగు ప్రణాళిక ఉండాలని చంద్రబాబు అప్పుడే గుర్తించారు. తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఇవేమీ సాధ్యం కాలేదు.
ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే చంద్రబాబు నిర్దేశించుకున్న ప్రణాళికను అమలు చేసే అవకాశముంది. ఇప్పుడు బూత్ లెవల్లో పనిచేస్తున్న కార్యకర్తల పని విధానాన్ని పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నందున తెలుగు తమ్ముళ్లకు మంచి రోజులు రావొచ్చు.