తిరుపతి రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన గుండెల్ని పిండేస్తోంది. ఏ ఆదరువు లేని పేదలే ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు. ప్రాణాలు కోల్పోయిన బిడ్డను తీసుకెళ్లడానికి అక్కడ అంబులెన్స్‌ల మాఫీయా చేసిన రాద్దాంతం అంతాఇంతా కాదు. బయట నుంచి అంబులెన్స్ తెచ్చుకుంటే దాన్ని నిలిపేశారు. గత్యంతరం లేక 90 కిలోమీటర్లు బిడ్డ శవాన్ని ఆ తండ్రి బైక్‌పైన తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంతగా తెగబడడానికి కారణం ఆస్పత్రి పాలకవర్గ ఉదాసీన వైఖరే. ఘటనకు సంబంధించి ఆరుగురు అంబులెన్స్‌ల యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
దాదాపు రెండేళ్ల క్రితం ఇక్కడ అంబులెన్స్‌ల దాదాగిరీ మామూలుగా ఉండేది కాదు. ఆస్పత్రి సిబ్బంది నుంచి అంబులెన్స్ యజమానుల వరకూ వాటాలేసుకొని పంచుకునేవాళ్లు. ఏదైనా గిరాకి తగిలిందంటే వీళ్లకు పండగే. వీళ్ల ఆగడాలు తట్టుకోలేక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వాళ్లు కళ్లు కుక్కుకుంటూ వెళ్లిపోయేది. బస్దాండు దాకా ఆటోలో వెళ్లి అక్కడ నుంచి సొంతూళ్లకు చేరేది. నాడు ఇక్కడ పరిస్థితిని గమనించిన అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి కొరఢా ఝుళిపించారు.
అంబులెన్సులను అసలు ఆస్పత్రిలో పార్క్ చేయకుండా నిలువరించారు. ఆస్పత్రి భద్రతా సిబ్బంది ద్వారా టోకెన్ సిస్టమ్ అమలు చేయించారు. ఆస్పత్రిపై నిరంతర పోలీసు నిఘా పెట్టారు. అంబులెన్స్‌ల యజమానులు, ఆస్పత్రి సిబ్బందికి ఉన్న లింకులపై ఆరా తీశారు. కొందరు ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. వాహనాల యజమానులకూ క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కొన్నాళ్లు పర్వాలేదనిపించింది. మళ్లీ షరా మామూలే అయింది.
ఇప్పటికైనా ఆస్పత్రి పాలక వర్గం అంబులెన్స్ యజమానుల పట్ల కఠిన వైఖరి తీసుకోవాలి. వాళ్లతో ఆస్పత్రి సిబ్బంది మిలాఖత్ అయితే వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలి. నిబంధనలను అతిక్రమించిన వాహన యజమానులపై కేసులు నమోదు చేయాలి.
రుయా ఆస్పత్రిలో పోలీసు అవుట్ పోస్టు ఉంది. అది నామ్‌కే వాస్తే. కనీసం ఆస్పత్రిలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. అప్పుడప్పుడు అలిపిరి పోలీసు స్టేషన్ నుంచి పోలీసులు రౌండ్స్ వేస్తుంటారు. ఇప్పటికైనా పోలీసు అవుట్ పోస్టు సమర్థవంతంగా పనిచేసేట్లు చర్యలు తీసుకోవాలి.