పిక్లా తండా పేరు ఎప్పుడూ ఎవరూ వినివుండరు. తెలంగాణ కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ మారుమూల పంచాయతీ. వంద శాతం గిరిజన గ్రామం. గోండులు, లంబాడీలు తప్ప మరో జాతి లేని గ్రామం. ఇప్పుడు పిక్లా తండా ఒక విశేష వార్త అయింది. అదనపు కలెక్టరు వరుణ్రెడ్డి ప్రారంభించిన పుస్తకోదయం అక్కడ దేదీప్యమానంగా వెలుగొందుతోంది.
స్కూల్లో పుస్తకం తప్ప మరో పుస్తకం ఉంటుందని తెలియని అమాయకపు పల్లె పిక్లా తండా. ఇలాంటి ఊళ్లో అందరి దృష్టి ఇప్పుడు పుస్తకం మీద పడింది. ప్రపంచం విశాలమని, అక్కడ పెద్ద పెద్ద పుస్తకాలుంటాయని, వాటిని తీరుబడిగా చదువుకోవచ్చని తొలిసారి పిక్లాతాండా వాసులకు, బడి పిల్లలకు తెలిసింది.
ఆ ఊళ్లో ఓ మొబైల్ లైబ్రరీ పుట్టింది. లైబ్రరీ అంటే పెద్దదో చిన్నదో ఒక గది, ఒకటి రెండు బీరువాలు, చాలా పుస్తకాలు కళ్ల ముందు కదలాడతాయి. పిక్లా తండా లో వెలసిన లైబ్రరీ ఒక చిన్న చెక్క స్తంభం మీద నిలబడిన చెక్క పెట్టె. చెక్కపెట్టెకొక గాజు తలుపు. లోన కొన్ని పుస్తకాలు. అంతే. ప్రతిరోజు పొద్దునే ఈ పెట్టెని పంచాయతీ కార్యాలయం నుంచి రచ్చబండ దగ్గరకు తీసుకొచ్చి నిలబెడతారు. పెట్టె స్తంభానికి అటూ ఇటూ బెంచీలు ఏర్పాటు చేశారు.

ఎవరైనా వచ్చి ఈ పుస్తకాలు అక్కడే కూర్చుని చదువుకోవచ్చు. సాయంకాలం 6 గంటల దాకా ఈ బుల్లి లైబ్రరీ తలుపులు తెరుచుకునే ఉంటాయి తర్వాత అది మళ్లీ పంచాయతీ కార్యాలయానికి తరలిపోతుంది. అందుకే దీన్ని తండా సంచార గ్రంథాలమయని పిలుస్తున్నట్లు ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి బొర్లకుంట మనీష్ తెలిపారు.
ఓ వారం కిందట లైబ్రరీ మొదలైంది. చదువురాని వాళ్లు సైతం పుస్తకం పట్టుకుని తన్మయత్వం చెందుతున్నారు. పుస్తకం చదువుతున్న వాళ్లు ఏదో తెలీని లోకాన్ని చూసినట్టుందని మురిసిపోతున్నారు. ఇదొక టర్నింగ్ పాయింటని మనీష్ సంతోషం వ్యక్తం చేశాడు.

పుస్తకం పఠనం బాగా తగ్గిపోతా ఉంది. సోషల్ మీడియా జీవితంలోకి ప్రవేశించి పుస్తకాన్ని తరిమేస్తూ ఉంది. పిక్లా తండా లాంటి చోట్ల ఈ పరిస్థితి ఇంకా ముదరలేదు కాబట్టి ఇక్కడి పిల్లల్లో పుస్తకం చేత పట్టే అలవాటు తీసుకురావచ్చని మా ఆశ. రోజుకు నలుగురైదురుగురు పిల్లలు వచ్చి ఈ పుస్తకాలను తిరగేసి వెళ్లినా మా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రయోగం విజయవంతమైనట్లేనని మనీష్ చెప్పారు.
ఇప్పుడు సుమతీ శతకం, భాస్కర శతకం, కాళోజీ ‘నా గోడవ’, శ్రీ శ్రీ మహాప్రస్థానం, పెద్దబాల శిక్ష, ఇంగ్లిష్ గ్రామర్, పెద్ద బాల శిక్ష, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ కు సంబంధించిన మరికొన్ని పుస్తకాలు, సాహిత్యం అందుబాటులో ఉంచారు. ఇక ముందు తెలంగాణ సంస్కృతి, టూరిజం, బొమ్మల నీతి కథలు, భారత రామాయణ కథలు వచ్చి చేరతాయని కూడా ఆయన చెప్పారు. ఎవరైనా పుస్తకాలను విరాళంగా కూడా ఇవ్వవచ్చని మనీష్ వివరించారు.
credits to Trending Telugu News.com