అసలే ఎండలకు జనం బెంబేలెత్తుతున్నారు. అంతకన్నా ఎక్కువగా నేతలు సెగలు పుట్టిస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌పై రేట్లు తగ్గించాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు. పెంచిన ధరల్లో వాటా రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రం దొడ్డిదోవన దొబ్బుకుంది. అది చాలదన్నట్లు రాష్ట్రాలే ప్రజల నెత్తిన భారాలు మోపుతున్నట్లు అభియోగం మోపుతూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపున పొరుగు రాష్ట్రంలోని కేటీఆర్ ఏపీ నుద్దేశించిన అన్నమాటలకు ఇక్కడ అధికార పార్టీ నేతలు కన్నెర్రజేస్తున్నారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. పెట్రో ధరలను తగ్గించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. గడచిన ఆరేళ్లలో కేరళ ప్రభుత్వం పెట్రోధరలు పెంచలేదని సీఎం విజయన్ స్పష్టం చేశారు. పెట్రో ధరలపై కేంద్రం దొంగ నాటకాలన్నీ ప్రజలకు తెలుసని తమిళనాడు సీఎం స్టాలిన్ దుయ్యబట్టారు.
రాష్ట్రాలు తగ్గించాలని ప్రధాని అడగడానికి సిగ్గూ ఎగ్గూ ఉండాలని కేసీర్ కళ్లు ఉరిమారు. గడచిన ఎనిమిదేళ్లలో రూ.26 లక్షల కోట్లు దోచారు. ఇదంతా ఏమైందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నిలదీశారు. అయినా ప్రధాని నుంచి స్పందన లేదు.
మరోవైపున హైదరాబాద్‌లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు, మంత్రులు నానాయాగీ చేస్తున్నారు. క్రెడాయ్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తన స్నేహితుడు చెప్పిన విషయాలను వెల్లడించారు.
ఏపీలో కరెంటు కోతలు, నీళ్ల సమస్య, గుంతలమయమైన రోడ్లతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు బస్సుల్లో తీసుకెళ్లి చూపిస్తే అప్పుడు తామెంత మెరుగ్గా ఉన్నామో తెలుస్తుందని స్నేహితుడు సలహా ఇచ్చాడట. అదే విషయాన్ని కేటీఆర్ చెప్పారు. అంతే ఇక ఏపీలో వైసీపీ మంత్రులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
కేసీఆర్‌లాగే కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నారంటూ మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కావాలంటే మీ రాష్ట్రాన్ని పొగుడుకోండి. మమ్మల్ని విమర్శిస్తే సహించేది లేదని మంత్రి సీదిరి అప్పలరాజు ఫైరయ్యారు. ఏపీలో కరెంటు కోతల్లేవ్. రోడ్లు బాగు పడ్డాయి.
ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా అని ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. డౌట్ ఉంటే ఏపీకి వచ్చి చూడండి. స్వయంగా చూపిస్తామని మరో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది ఎలా జరుగుతుందో వచ్చి చూస్తే మీకే తెలుస్తుందని మంత్రి జోగి రమేష్ చెప్పారు.