రాబందును చూసి తన చేతిలో ఉన్న ముద్దను ఎక్కడ లాక్కుంటుందోనన్న భయంతో ఆ చిన్నారి దోసిటను ఒంటికింద దాచుకుంది. ఆ రాబందు చిన్నారి చేతిలో ముద్ద కోసం రాలేదు. బక్కపలచగా మారి ఏ క్షణాన్నయినా ఆ చిన్నారి చనిపోతుందని ఎదురు చూస్తోంది. ఈ సంగతి ఆ పాపకు తెలియదు.
1990 దశకంలో దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ కార్టర్ తీసిన ఈ ఫొటోతో దేశదేశాల్లో పేరు ప్రతిష్టలు గడించాడు. ప్రపంచంలోని 100 ప్రభావవంతమైన చిత్రాల్లో ఇది మొదటి స్థానం దక్కించుకుంది. నార్త్ ఆఫ్రికా సుడాన్లో వచ్చిన కరువు వల్ల చాలా మంది పెద్దలూ, పిల్లలూ చనిపోయారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కరవు చిత్రాలను సేకరించే పని కెవిన్‌కు అప్పజెప్పింది.
ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు..
కరవు ప్రాంతమైన సుడాన్‌కు వెళ్లిన కెవిన్ చాలా ఫొటోలు తీశాడు. వాటిలో ప్రపంచాన్ని కలచివేసిన ఫొటో ఇది. “ది వల్చర్ అండ్ ది లిటిల్ గర్ల్” పేరుతో 1993 మార్చి 26న న్యూయార్క్ టైమ్స్ సుడాన్ కరవు పై కథనం ప్రచురించింది. ఈ ఫొటో యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించాయి.
ఫొటోగ్రాఫర్లందరూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్ ప్రైజ్ ఆ ఏడాది కెవిన్ ఫొటోకి దక్కింది. 32 ఏళ్ల కెవిన్ పేరు దశదిశలా వ్యాపించింది. కెవిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని వేల ఉత్తరాలు, కానుకలూ వచ్చాయి. తీరిక దొరకనంత సత్కారాలు జరిగాయి. తర్వాత ఏమైందో ఏమో…ఆ మరుసటి ఏడాది 1994 జులై 27న కెవిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కెవిన్‌కు అప్పుడు 33 ఏళ్లు.
అపరచిత వ్యక్తి ఫోన్ కాల్‌తో కెవిన్లో అంతర్మథనం..
సన్నిహితులు, మిత్రులూ తెలిపిన కారణాలు ఇలా ఉన్నాయి. “కెవిన్ ప్రశంసలతో ఎంజాయ్ చేస్తున్న రెండు నెలల తర్వాత ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఆ పాపకు తర్వాత ఏమైంది అని అడిగాడు. ఫ్లయిట్ టైం అయిపోతుండటంతో తను అత్యవసరంగా వెనక్కి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత పాపకేమైందో తెలియదని కెవిన్ బదులిచ్చాడు.
ఆ మాటలు విన్న అవతలి వ్యక్తి.. ‘ఆ క్షణంలో అక్కడ ఉన్న రాబందు ఒకటి కాదు.. రెండూ అన్నాడట. ఒకటి చనిపోతే పాపని తినాలని ఎదురు చూసిన రాబందు అయితే.. రెండోది చేతిలో కెమెరా పట్టుకుని కూర్చున్నది’ అంటూ ఫోన్ పెట్టేశాడు.
కెవిన్ పశ్చాత్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
అప్పటినుంచి కెవిన్లో మార్పు మొదలైంది. కొన్నిరోజుల తర్వాత కెవిన్ జనంతో మాట్లాడడం, కనిపించడం తగ్గించేశాడు. చాలా అంతర్మథనానికి లోనయ్యాడు. తను తప్పు చేశానా అంటూ కుమిలిపోయాడు. మేము కూడా ఓదార్చడానికి ప్రయత్నించాం. కానీ తను మారలేదు” అని చెప్పారు.
ఆ తర్వాత కెవిన్ తిరిగి సౌతాఫ్రికా వెళ్ళాడా? ఆ పాప కోసం కనుక్కున్నాడా? ఆ పాప ఏమైంది? నిజంగానే కెవిన్ అక్కడి నుంచి వచ్చేశాక ఆ రాబందు పాపను తినేసిందా అనేది ఎవరికీ తెలియదు. ఒక్క కెవిన్‌కు తప్ప. తను ఏం తెలుసుకున్నాడో.. ఎంత కుమిలిపోయాడో..
కెవిన్ చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఆడుకున్న పార్క్‌కు వెళ్లాడు. తన కార్ ఎగ్జాస్ట్ పైప్‌ని మూసేసి, కారు అద్దాలు ఎక్కించుకుని, లాక్ చేసి, ఇంజిన్ ఆన్ చేశాడు. దాంతో కారు లోపల నిండిన కార్బన్ మానాక్సైడ్ను పీలుస్తూ చనిపోయాడు. ఎంత బాధని అనుభవించి ఉంటే తను ఇంత ఘోరంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు !
కెవిన్ నుంచి మనమేం నేర్చుకోలేమా !
మన చేతిలో కెమెరాలు, ఇంటర్నెట్ ఉంది కదా అని సాటి మనుషులను అర్ధం చేసుకోవడం మానేస్తున్నామా? ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్న ఆతృతతో నిజా నిజాలు గ్రహించకుండా నీలాపనిందలు వేస్తూ తిరుగుతున్నామా? దానివల్ల ఒకరికి నష్టమే జరుగుతుంది కానీ ఎటువంటి ప్రయోజనం లేదు.
మనిషి చనిపోతుంటే సెల్ఫీలు దిగుతున్న మనకూ కెవిన్‌కు తేడా లేదేమో? ఎవరో తమ అభిప్రాయాలను తమ పరిధిలో రాస్తున్నా, చెప్తున్నా, విచక్షణ లేకుండా దాడికి దిగుతున్న మనకూ కెవిన్కూ తేడాలేదేమో? అక్కడ కెవిన్ మరిచిందీ.. ఇప్పుడు మనం విస్మరిస్తున్నదీ ఒకటే ! అదే మానవత్వం. అందుకే ముందుగా నీ లోపలి మృగాన్ని చంపెయ్ !
సేకరణ : Arjun Reddy FB wall