ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రజల విశ్వసనీయత పొందడానికి ప్రయత్నించాలి. పాలక పక్షాన్ని ఏదైనా ప్రశ్నించినా.. విమర్శించినా అది ప్రజలు ఆమోదించేట్లుండాలి. దీనికి భిన్నంగా టీడీపీ నేతలు చౌక బారు విమర్శలకు.. విష ప్రచారానికి పాల్పడడం దారుణం. టీటీడీకి సంబంధించి సుమారు 1400 కిలోల బంగారం లెక్కా పత్రం లేకుండా రెండు రోజుల కిందట తరలిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ యంత్రాంగం ప్రచారం చేస్తోంది. దీన్ని ప్రజలు నమ్ముతారా !
వాస్తవానికి ఈ ఘటన 2019 ఏప్రిల్లో చోటుచేసుకుంది. తమిళనాడు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఎలాంటి పత్రాల్లేకుండా 1381 కిలోల బంగారాన్ని మూడు వాహనాల్లో తరలిస్తున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కావడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. చెన్నై పోలీసులు వాహనాలను పట్టుకున్నారు. తర్వాత టీటీడీ అధికారులు సదరు బంగారాన్ని వేరేచోటకు తరలిస్తున్నట్లు అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది.
ప్రస్తుతం దాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి, ఈవో తలకు చుడుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు.. ఎవరూ నోరు మెదపడం లేదని నిందిస్తున్నారు.
నాటి సంఘటన గుర్తున్న వాళ్లు ఇదేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా దుష్ప్రచారానికి పాల్పడుతుంటే వీళ్లను ప్రజలు ఎలా నమ్ముతారు ! టీడీపీ నేతలు నిజంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినా ఇది కూడా బోగస్ ఏమో అనుమానించే స్థితి కొని తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఈరోజే టీడీపీ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు సంబంధించి కొన్ని ప్రధానమైన అంశాలను ప్రభుత్వంపై ఎక్కు పెట్టారు. ఆర్బీకేలు నిజంగా రైతులకు సేవలందిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 20 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ఆర్బీకేల ద్వారా కేవలం 2 లక్షల టన్నులే కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో ఎంత మంది రైతుల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేశారని నిలదీశారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కింటా ధాన్యాన్ని రైతులు రూ.1300 నుంచి రూ. 1400కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గోదావరి జిల్లాల్లో అయితే ధాన్యం కొనుగోలు కోసం రైతులు రోడ్డెక్కుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీకేలతో వైసీపీ మద్దతు దళారులు, రైస్ మిల్లర్లు మాత్రమే లాభ పడుతున్నట్లు ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం చెప్పినట్లు ఏ ప్రయోజనం నెరవేరడం లేదని విమర్శించారు.
ఇలా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రతిపక్ష పార్టీ కొంతమేరకైనా ప్రజల విశ్వాసాన్ని పొందుతుంది. దీనికి భిన్నంగా తప్పుడు విష ప్రచారాలకు పాల్పడితే ప్రజల్లో ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు తెలుగు తమ్ముళ్లను పనికి మాలిన ప్రచారాల జోలికెళ్లొద్దని మందలించాలి. అవి తిరిగి తమ తలకే చుట్టుకుంటాయన్న వాస్తవాన్ని బోధించాలి.
Plz Support us..

Encourage Independent Journalism