నిన్నటి జగనన్న విద్యా దీవెన నగదు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పదో తరగతి ప్రశ్నా పత్రాలను లీక్ చేసింది నారాయణ, చైతన్య విద్యా సంస్థలేనని చెప్పారు. ఇప్పటిదాకా చోటుచేసుకున్న అత్యాచారాల్లో టీడీపీ వాళ్లే నిందితులుగా ఉన్నట్లు ఆరోపించారు. ప్రతిపక్షనేతగా ఆరోపణలు చేస్తే ప్రభుత్వం స్పందించి వివరణ ఇవ్వాలి. నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలి. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇలా మాట్లాడడమేంటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
మూడేళ్ల క్రితం ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ ఇదే నారాయణ, చైతన్య విద్యా సంస్థల కోసం ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేశారని చంద్రబాబు సర్కారును ఏకిపారేశారు. తాము అధికారానికి వస్తే ఆ రెండు సంస్థల పీచమణిచేస్తామన్నారు.
ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి సంపన్నుడైనా.. పేదోడైనా అక్కడే చదువుకునేట్లు తీర్చిదిద్దుతామన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులను కూడా ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే స్థాయికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.
ఇప్పటిదాకా నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై ఏం చర్యలు తీసుకున్నారు ! వాళ్ల ఫీజుల దోపిడీ ఆగిందా ! నిబంధనలు అతిక్రమిస్తున్నా కనిపించడం లేదా ! అసలు పదోతరగతి ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చేతిలో అధికారం పెట్టుకొని ఆ సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పగలరా ! ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు ఆరోపణలు చేస్తే నప్పవు.
నాడు–నేడు కింద ప్రభుత్వ బడులకు రంగులేశారు. వసతులు మెరుగు పరిచారు. ఇదొక్కటే చాలదు. ఈపాటికే ఇవి పేదల పిల్లలు చదువుకునే బడులని, సరిగ్గా పంతుళ్లు చదువు చెప్పరనే పిచ్చికుక్క ముద్ర వేశారు. దాన్ని తొలగించి పేద పిల్లలతోపాటు ధనవంతుల పిల్లలను చేర్పించేట్లు చేయగలిగారా.. ఆ దిశగా ఒక్కడుగన్నా ముందుకు పడిందా !
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అంతే. ఇక్కడ పేదలే వైద్యం చేయించుకుంటారు. డాక్టర్లు, సిబ్బంది సరిగ్గా పనిచేయరు. వసతులుండవనే భావనలోకి ప్రజలను నెట్టేశారు. మళ్లీ పేద వర్గాలతోపాటు సంపన్నులను ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మళ్లించగలిగారా ! ఆ దిశగా ఒక్క చర్య అయినా తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మరీ దారుణంగా ఉన్నాయి.
ఇక వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచారాల్లో నిందితులు టీడీపీకి చెందిన వాళ్లే ఉన్నట్లు ఆరోపించారు. సీఎం స్థాయిలో ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటే ఎలా! నిందితులను టీడీపీ నేతలు ప్రేరేపించారని ఆధారాలుంటే పోలీసులకు ఇచ్చి అరెస్టు చేయించాలి. జైలుకు పంపాలి. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈపని చేయకపోగా ఇంకా ప్రతిపక్ష నేతలాగా ఆరోపణలు చేయడమేంటీ ! ప్రజలు అన్నీ నిశితంగా గమనిస్తున్నారు. ఆలోచించండి సీఎం సార్ !
Plz Share and Contribute..

Encourage Independent Journalism