రాహుల్ గాంధీ వరంగల్ సభ సక్సెస్ అయింది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పాలన సాగించలేకపోయిందని రాహుల్ గాంధీ చెప్పారు. సహజ వనరుల దగ్గర నుంచి ప్రజా ధనం పెద్ద ఎత్తున లూటీ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని రాహుల్ వెల్లడించారు.
రాహుల్ గాంధీ ప్రసంగం ఆద్యంతం టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని చెప్పినట్లుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ జోడీ కట్టకుంటే బీజేపీని ఎదుర్కోవడం కష్టమని ఈ రెండు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే కొంత కసరత్తు చేశారు. హఠాత్తుగా టీఆర్ఎస్తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలంగాణలో బీజేపీని వెనక్కి కొట్టాలంటే ఇదే సరైన వ్యూహమని రాహుల్ గాంధీ భావించినట్లుంది.
ఇటీవల ఏ ఉప ఎన్నిక జరిగినా అధికార టీఆర్ఎస్ కు చేదు ఫలితాలు వచ్చాయి. అన్నిచోట్ల కాంగ్రెస్ మూడో స్థానంలోకి జారిపోయింది. టీఆర్ఎస్ను ఢీ కొట్టింది బీజేపీనే. కమలనాధుల పార్టీ ఇప్పటిదాకా అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రభావం చూపుతుందనే భావన నెలకొంది. దాన్ని పటాపంచలు చేస్తూ చాపకింద నీరులా కాషాయ దళాలు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమనే సంకేతాలు ఇచ్చింది.
ఇక్కడ బీజేపీని మూడో స్థానానికే పరిమితం చేయాలంటే కాంగ్రెస్ ధీటుగా పోటీనివ్వాలి. టీఆర్ఎస్తో జత కడితే బీజేపీ మరింత బలపడుతుంది. అందుకే కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేననే ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో బీజేపీ శత్రువైనా ఇక్కడ టీఆర్ఎస్నే టార్గెట్ చేస్తోంది. రేవంత్రెడ్డి విమర్శనాస్త్రాలన్నీ గులాబీ దళంపైనే ఎక్కుపెట్టారు. అసలు బీజేపీ తమకు శత్రువు కాదనే లెక్కలో ఆయన ప్రచారం సాగుతోంది. ఇదంతా చూస్తుంటే బీజేపీని వెనక్కి నెట్టే ఎత్తుగడలా కనిపిస్తోంది.
We stand with unbiased news. share and contribute. Rs.100 can also be provided

Encourage Independent Journalism