టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను గుర్తించినట్లు ట్వీట్ చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంకా ప్రజలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికినట్లు కూడా ట్విట్లర్లో పేర్కొన్నారు. తెలుగు తమ్ముళ్ల ఉత్సాహం గురించి సంతోషంగా వివరించారు. అసలు అసంతృప్తి ఎందుకు పెరిగింది.. అది టీడీపీకే లాభిస్తుందని ఎలా నిర్ధారిస్తారు !
వాస్తవానికి టీడీపీ హయాంలో సగటు ప్రజలకు విద్య, వైద్యం తలకు మించిన భారమయ్యాయి. వర్షాల్లేక కరవు కాటకాలతో అల్లాడుతున్న ప్రజల కష్టాలను.. కన్నీళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రాజధాని పేరుతో దేశాలు చుట్టి రావడంతోనే సగం కాలం కరిగిపోయింది. సగటు పౌరుడికి రాజధానితో అసవరమేముంది ? కావాల్సింది చేతి నిండా పని. జేబు నిండా డబ్బులు. అవి నెరవేర్చకుండా ఎన్ని చెప్పినా.. ఏం చేసినా ప్రయోజనం లేదు. అందుకనుగుణంగానే ప్రజలు టీడీపీని తిరస్కరించి వైసీపీకి పట్టం గట్టారు.
చంద్రబాబు వైఫల్యాలపైనే జగన్ దృష్టి సారించారు
గత మూడేళ్ల నుంచి వైసీపీ సర్కారు అమ్మ ఒడి పేరుతో కొంత పిల్లల చదువు భారాన్ని తగ్గించింది. ఆరోగ్యశ్రీలో మరిన్ని వ్యాధులను చేర్చింది. వెయ్యి రూపాయల ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేసింది. నిమ్న వర్గాలకు సంక్షేమ పథకాల పేరిట నేరుగా నగదు బదిలీ చేసింది.
నాడు–నేడు పేరుతో ప్రభుత్వ బడులను, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత తీర్చే ప్రయత్నం చేస్తోంది. కొన్ని లోపాలున్నా రైతులకు రైతు భరోసా, మహిళలకు విడతల వారీ డ్వాక్రా రుణ మాఫీ, పేదలకు చిన్నదో చితకదో ఇల్లు కట్టించి ఇస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం ఏఏ అంశాల్లో నిర్లక్ష్యం చేసిందో వాటిని భర్తీ చేయడంపైనే జగన్ సర్కారు దృష్టి పెట్టింది.
కరోనా తర్వాత దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోలేదు
సగటు ప్రజల అవసరాలు ఒకటి తీరితే వాటి స్థానంలో నాలుగు వచ్చి చేరతాయి. ఇది సహజం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ వైరస్ భీభత్సం సృష్టించింది. ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా విధించిన లాక్ డౌన్లు, ఆంక్షలతో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి.
కార్మికులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారుల కుటుంబాలు కకావికలమయ్యాయి. ఉద్యోగాలు ఊడాయి. ఉపాధి పోయింది. తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 92 శాతం మందికి పైగా రుణగ్రస్తులయ్యారని సర్వేలు వెల్లడించాయి.
ఇలాంటి తీవ్ర నిరాశా నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తిరిగి ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై దృష్టిసారించలేదు. ఈపాటికే దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు కేటాయించిన బడ్జెట్ నిధులను నిర్దిష్టమైన సుస్థిర స్వయం ఉపాధికి వెచ్చించలేదు. ఊరుమ్మడి సంక్షేమ పథకాలకు మళ్లించారు. దీంతో ఆయా వర్గాలకు పరిమితంగానైనా స్వయం ఉపాధి కల్పించలేకపోయారు.
ఆదాయాలు కోల్పోయిన ప్రజలపై మరిన్ని భారాలు
మరోవైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపాయి. నిత్యావసరాల నుంచి పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను 200 శాతానికిపైగా పెంచేశారు. పెరిగిన మద్యం ధరలు, రవాణా, విద్యుత్ చార్జీలు, చెత్త, ఆస్తి, ఇంటి పన్నులు మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ సామెతయింది. నికర ఆదాయాన్ని కోల్పోయిన పేద, మధ్యతరగతి జీవులు పెరిగిన భారాలతో మరింత విలవిల్లాడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రోది చేశాయి.
కష్టాల నుంచి విముక్తికి టీడీపీ ఏం చేస్తుందో చెప్పాలి కదా
వీటి నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికి టీడీపీ ఏం చేస్తుందో చెప్ప లేదు. ఎక్కడ బహిరంగ సభలు, ర్యాలీలు జరిగినా తమ హయాంలో ఏం చేశామో చెబుతున్నారు తప్ప ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ప్రజలను ఎలా గట్టెక్కిస్తారనేది స్పష్టం చేయడం లేదు. అలాంటప్పుడు వైసీపీ సర్కారుపై పెరిగిన అసంతృప్తి టీడీపీకి ఎలా లబ్ది చేకూరుతుందో వారికే తెలియాలి.
వాళ్లు కాకపోతే వీళ్లు.. వీళ్లు కాకుంటే వాళ్లనే నానుడి ఎప్పుడో మాసిపోయింది. ప్రజల్లో లోతయిన అవగాహన పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి జ్వాలలు సమసిపోతాయా… టీడీపీకి లాభిస్తాయా.. లేక మరో రూపం తీసుకుంటాయా అనేది రానున్న ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తాయి.
We stand with unbiased news. share and contribute. Rs.100 can also be provided

Encourage Independent Journalism