వైఎస్సార్ మెగా జాబ్ మేళాతో నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం జగన్ ఆశయమని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. శనివారం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. 210 కంపెనీలు పాల్గొన్నాయి. 97 వేల మంది ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. 26 వేల పైచిలుకు ఉద్యోగాలు లభించనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఎంపిక కాని వారికి స్కిల్ డెవలప్మెంటు సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.
టీడీపీ కుట్రలను ఎదుర్కోవాలి
టీడీపీ కుట్రలను న్యాయబద్దంగా ఎదుర్కోవాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి న్యాయవాదులకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాతో అనుసంధానం చేసుకొని లీగల్ సెల్ పనిచేయాలని సూచించారు. పార్టీ ప్లీనరీలోగా జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రైతులను ఆదుకోవాలని సీఎంకు అచ్చెన్నాయుడి లేఖ
అకాల వర్షాలు, గాలి భీభత్సానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో ఆరబెట్టిన మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి. వీటన్నింటిపై సర్వే చేయించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్‌కు లేఖ రాశారు. తడిసిన పంటలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ ప్రజలు అభివృద్ధినే కోరుకుంటారు – వైవీ సుబ్బారెడ్డి
విశాఖ ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధినే కోరుకుంటారు. గత టీడీపీ హయాంలో ఏం చేశారో.. మూడేళ్ల లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలు గమనించాలని ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటరు వైవీ సుబ్బారెడ్డి సూచించారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సుబ్బారెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వానికి పట్టం గట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
మరో పదిమంది తెలుగు మహిళలు అరెస్ట్
ఒంగోలులో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ను అడ్డగించిన కేసులో మరో పదిమంది తెలుగు మహిళా నాయకులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో వారిని హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు.
ఆర్థిక దుస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసింది. అప్పు లేనిదే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఓవైపున ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నారు. మరోవైపు ఇష్టారాజ్యంగా దొరికిన చోటల్లా అప్పులు తెస్తున్నారు. ఇంకో వైపు కేంద్రం నుంచి భారీగానే గ్రాంట్లు వస్తున్నా ఈ దుస్థితి ఎందుకు తలెత్తిందో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకుండా బిల్లులు ఎందుకు వెనక్కి కొడుతున్నారో చెప్పాలన్నారు. రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.
We stand with unbias news. share and contribute. Rs.100 can also be provided

Encourage Independent Journalism