కౌలు రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందంటూ త్వరలో లేఖలు రాస్తామని సీఎం జగన్ వెల్లడించారు. రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖపై సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు. అసలు రాష్ట్రంలో కౌలు రైతులు ఎంత మంది ఉన్నారో తెలుసా! ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల్లో ఒక్క శాతానికి మించి కౌలు రైతులకు అందడం లేదన్న సంగతన్నా తెలుసా ! ప్రస్తుతం సీసీఆర్సీ కార్డులు పొందిన వాళ్లు నిజమైనా కౌలు రైతులేనా ! ఇంతకీ కౌలు రౌతులకు ఏమని లేఖ రాస్తారు ?
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో రైతు స్వరాజ్య వేదిక కౌలు రైతులపై ఓ సర్వే చేసింది. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలుతో కలిపి మొత్తం 9 జిల్లాల్లో అధ్యయనం చేసింది. రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులున్నట్లు రైతు స్వరాజ్య వేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం 16 లక్షల మంది మాత్రమే కౌలు రైతులున్నట్లు లెక్క గట్టింది. ఇంకా పాక్షిక కౌలుదార్లను కూడా కలుపుకుంటే మరో పది లక్షల మందికి పైనే ఉండొచ్చు.
సీసీఆర్సీ కార్డులిచ్చింది 9.6 శాతం మందికే
ఇప్పటిదాకా మొత్తం క్రాప్ కల్టివేటింగ్ రైట్స్ కార్డులు 9.6 మందికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. అందులో రైతు భరోసా అందుకుంటుంది కేవలం 3 శాతం కౌలు రైతులు మాత్రమే. ఒక్కో కౌలు రైతుకు సగటున రెండు లక్షల రూపాయల అప్పు ఉంది. విపరీతంగా పెరిగిన కౌలు ధరలు, పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవడం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందలేకపోవడం కారణంగా అప్పుల పాలైనట్లు ఈ సంస్థ సర్వేలో తేలింది.
ఇంకా సున్నా వడ్డీ పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్పిడీలు ఏవీ కౌలు రైతులకు అందక రుణాల ఊబిలో చిక్కుకున్నట్లు వెల్లడించింది. విశాఖ, అనంతపురం, కడప జిల్లాల్లో కౌలు ధరలు భరించలేక పంటల సాగు వదిలేసి వలసపోతున్నట్లు పేర్కొంది.
సీసీఆర్సీ కార్డుల్లో 90 శాతం బోగస్ పేర్లే
“అసలు కౌలు చేస్తున్న వాళ్లకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వడం లేదు. భూ యజమానుల స్నేహితులు, బంధువుల పేర్లతో అధికారులు కార్డులు ఇస్తున్నారు. మా ఊళ్లో 294 సీసీఆర్సీ కార్డులుంటే అందులో మూడొంతులు అమెరికా, బెంగళూరు, హైదరాబాద్లో ఉన్నవాళ్ల పేర్లు మీద ఉంటాయి. ఇక్కడ వాస్తవంగా కౌలు సాగు చేస్తున్నవాళ్లలో పది శాతం మంది క్కూడా కార్డుల్లేవు!”అంటూ ఎన్టీఆర్ జిల్లా కంకిపాడు మండలం గొడవర్రుకు చెందిన మరియదాసు ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రభుత్వ పథకాలు 70 శాతం భూయజమానులకే
గడచిన మూడేళ్ల నుంచి కౌల్దారీ చట్టంలోని లోపాలతో కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు రావడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాలూ అందడం లేదు. అవన్నీ 70 శాతం భూయజమానులకు పోతున్నాయి. అందుకే అప్పుల సాగు చేయలేక కొందరు వలసలు పోతుంటే.. ఇవే అప్పులు తీర్చలేక మరికొందరు బలన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర జనాభా 60 శాతం ఆధారపడిన వ్యవసాయంలో ఇన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం చెవికెక్కక పోవడం మరీ వింతగా ఉంది. ఇప్పుడు చెప్పండి సీఎం సార్ ! ఏమని లేఖలు రాస్తారు ?
Share and contribute. Encourage Independent Journalism
