‘‘పేపర్లో.. టీవీల్లో ప్రకటన కూడా ఇచ్చాం!
ఇంతవరకూ స్పందన లేదు.
ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా !’’
అంటూ రోహిణీ వాళ్లమ్మను పట్టుకొని కన్నీరుమున్నీరైంది.
ఆమె భర్త రమేష్‌కు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.
ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
తన కిడ్నీ ఇస్తానంటే పనికి రాదని డాక్టరు చెప్పాడు.
పిల్లలకు కన్నీళ్లు కనపడకుండా పైట చెంగుతో తుడుచుకుంటూ రోదిస్తోంది.
రమేష్, రోహిణీ దంపతులకు ఇద్దరు పిల్లలు.
బెజవాడకు పాతిక కిలోమీటర్ల దూరానున్న ఓ పల్లెటూరు వాళ్లది.
రమేష్‌కు ఇద్దరు అన్నదమ్ములు.
ఎవరి కాపురాలు వాళ్లవే.
రమేష్ తల్లితోపాటు ఉంటున్నాడు.
పిల్లల చదువుల కోసమంటూ విజయవాడలో కాపురం పెట్టాడు.
ఆమె ఒంటరిగా ఉంటోంది.
హాయిగా రోజులు గడుస్తున్న తరుణంలో రమేష్ అస్వస్థతకు గురయ్యాడు.
ఆస్పత్రిలో చూపిస్తే రెండు కిడ్నీలు పాడైనట్లు తేల్చారు.
కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చకుంటే బతకడం కష్టమని చెప్పారు.
బంధువులంతా ఆస్పత్రికి వచ్చి చూసి వెళ్తున్నారు.
ఓ కిడ్నీ ఇస్తామని ఎవరూ ముందుకు రావడం లేదు.
రమేష్ అమ్మ, అన్నదమ్ములు వచ్చి చూసి వెళ్లారు.
చివరకు రోహిణీ తల్లిదండ్రులు, తోడబుట్టినోళ్లూ అంతే.
ఆస్పత్రి వరండాలో పిల్లల్ని పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది.
అంతలో అటుగా వార్డు బాయ్ వచ్చాడు.
డాక్టరు పిలుస్తున్నట్లు చెప్పాడు.
పిల్లలను బయట కూర్చోబెట్టి డాక్టరు చాంబర్లోకి వెళ్లింది.
“ ఎవరో ఓ ముసలావిడ చనిపోతూ తన అవయవాలు ఎవరికైనా దానం చెయ్యాలని రాసిచ్చిందట.
ఆమె కిడ్నీలను పరీక్షిస్తున్నాం.
సరిపోతే రమేష్ కోలుకున్నట్లే” అన్నాడు డాక్టరు.
రోహిణీకి గుండెల్లో భారమంతా దిగిపోయింది.
డాక్టరుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుంచి బయటపడింది.
ఆ మృతురాలి కిడ్నీలు రమేష్‌కు సరిపోతాయని తేలింది.
వెంటనే చకా చకా ఆపరేషన్‌కు ఏర్పాట్లు జరిగాయి.
రమేష్ కోలుకున్నాడు.
పది రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు.
అంతలో రమేష్ అన్నదమ్ములు అక్కడకొచ్చారు.
అమ్మ కనిపించడం లేదని ఆందోళన పడుతూ చెప్పారు.
“మీకసలు బుద్ది ఉందా !
ఇప్పుడే కోలుకున్నాడు.
ఆయనకు ఇలాంటి వార్త ఇప్పుడు చెప్పాలా !
ఆమె మాకు ఏమంత ఇరగబొడిచిందని.
పోతే పోనీ. ఎక్కడ చచ్చిందో మాకెందుకు !’’
అంటూ రోహిణీ రుసరుసలాడింది.
అక్కడే ఉన్న డాక్టరు రోహిణి చెంప ఛెళ్లుమనిపించాడు.
“ షటప్ ఐ సే ! ఇంకొక్క మాట ఆ మహాతల్లి గురించి మాట్లాడితే చేం చేస్తానో నాకే తెలీదు!’’
అంటూ డాక్టరు తడిదేరిన కళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయాడు.
అక్కడున్న వాళ్లకు ఏం అర్థంగాక నిశ్చేష్టులయ్యారు.
– హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలతో ‘తెలుగిల్లు’కథ
Share and contribute..

Encourage Independent Journalism