టీడీపీ.. జనసేన పార్టీ ల మధ్య పొత్తు ఖాయమైనట్లేనని భావిస్తున్న తరుణంలో ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. కాకినాడలో తాను పొత్తుల గురించి ప్రస్తావించలేదన్నారు. జగన్ సర్కారును ఓడించడానికి ప్రజలంతా ఏకం కావాలని తాను అన్నట్లు చెప్పారు. తన మాటలను మీడియా వక్రీకరించి పొత్తుల గురించి అన్నట్లు ప్రచారం చేసిందని ఆయన వివరణ ఇచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలతో ఈ రెండు పార్టీల యంత్రాంగంలో గందర గోళం నెలకొంది. ఎక్కడో తేడా కొడుతోంది. అదేంటబ్బా అంటూ జనం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక ఓటును చీలిపోకుండా దేనికైనా సిద్దమేనని మొట్టమొదట జన సేనాని పవన్ కల్యాణ్ పొత్తుల తుట్టెను రేపారు. విపక్షాలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైనట్లు ఆయన చెప్పారు. దీనికి స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్లు తన ఉత్తరాంధ్ర పర్యటనలో గుర్తించానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి ఏ త్యాగానికైనా సిద్దమేనని స్పష్టం చేశారు.
నిన్న ఉమ్మడి కర్నూలు జిల్లా కౌలు రైతు భరోసా యాత్రలో చంద్రబాబు నేరుగా పొత్తు గురించి నేరుగా మాట్లాడితే చర్చిస్తానని జనసేనాని సంకేతమిచ్చారు. కాకినాడలో తాను పొత్తుల గురించి ప్రస్తావించలేదని చంద్రబాబు నాలిక మడతెట్టేశారు. జగన్ సర్కారును సాగనంపడానికి ప్రజలంతా ఏకం కావాలని తాను అన్నట్లు ఈరోజు పార్టీ కార్యకర్తల సమావేశంలో వివరణ ఇచ్చారు.
బీజేపీతో చేదు అనుభవాలు..
బీజేపీతో కలిసిన జనసేన పార్టీతో ముందుకెళ్తే దెబ్బతింటామని టీడీపీ యంత్రాంగంలో ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. గతంలో ఆ పార్టీతో స్నేహం చేసిన ఎన్టీఆర్ కూడా తర్వాత వ్యతిరేకించారు. చంద్రబాబు సైతం తన నావ మునిగిపోతుందని భావించి 2019 ఎన్నికల్లో కాషాయ పార్టీకి దూరంగా జరిగారు. అప్పటికీ జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. చివరకు పార్లమెంటరీ పార్టీ బీజేపీలో కలిసిపోయింది.
ఈసారి మళ్లీ పొత్తు పెట్టుకుంటే అసలు తెలుగు దేశం పార్టీనే ఉండదని అవగతమైంది. దీనికి తగ్గట్లు బీజేపీలో టీడీపీని కలిపేయడం తప్ప గత్యంతరం లేదని గతంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.
బీజేపీ లేని జనసేనతో ఐతే ఓకే..
అందుకే ఇప్పుడు చంద్రబాబు తాను పొత్తులకు తొందర పడడం లేదని సంకేతమిచ్చారు. బీజేపీ సంక దిగి వస్తే జనసేనతో కలవాలని టీడీపీ భావిస్తోంది. ఆపార్టీ యంత్రాంగంలో కూడా ఇదే భావన నెలకొంది. మరోవైపున ముందుగానే ముందుగా స్పందిస్తే బేరసారాల దగ్గర తేడా రావొచ్చనే ఆలోచన కూడా అయ్యుండొచ్చు. అందుకే చంద్రబాబు పార్టీ నాయకుల సమావేశంలో టీడీపీ పొత్తుల కోసం వెంపర్లాడడం లేదన్నట్లు చెప్పుకొచ్చారు.
జనసేనలోనూ అంతర్మథనం..
మరోవైపు జనసేన పార్టీ యంత్రాంగంలోనూ ఇదే భావన నెలకొంది. బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు ఒరిగేదేమీ లేదు. ఇప్పటిదాకా అనేక నష్టాలను చవిచూశామన్న భావన ఉంది. అందుకే కాషాయ జెండాతో కటీఫ్ చెప్పేసి టీడీపీతో కలవాలనే ఆసక్తి ఉంది. ఈసారి కొద్దొగొప్పో సీట్లు తెచ్చుకొని ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకుంటే పార్టీ మనగలగడం కష్టమని గుర్తించారు.
జనసేనను జారిపోనివ్వకూడదని బీజేపీ ఎత్తుగడ
ఇంకోవైపున ఏపీ కమలం పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ జనసేనతోనే తమ పొత్తు ఉంటుందన్నారు. టీడీపీతో పొత్తు అవసరం లేదన్నట్లు మాట్లాడారు. దీంతో జనసేన పార్టీ గుండుగుత్తగా తమ అమ్ముల పొదిలోనే ఉంచుకుంటే ఇక్కడ టీడీపీ ఎప్పటికీ గెలవలేదనే భావన అయ్యుండొచ్చు.
వైసీపీకి బీజేపీ పెద్దల అండదండలున్నాయి. అందువల్ల జనసేనను టీడీపీ వైపు వెళ్లకుండా చేయడం కోసమే అలా స్పందించి ఉండొచ్చు. ఏదిఏమైనా రాజకీయ కూడలిలో జనసేన కింగ్ మేకరయింది. మరి సేనాని ఎలా స్పందిస్తారో !
Share and contribute. Encourage Independent Journalism
