ఆదిమ జాతి అంటే మన పూర్వీకులు. అందులో బొండా జాతి ఒకటి. అది ఇప్పుడు క్రమంగా ఉనికిని కోల్పోతోంది. అడవుల నుంచి వాళ్లు బయటకు రారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలుండవు. దీంతో ఈ జాతి అంతరించిపోతుందేమోననిపిస్తోంది. ఇంతకీ బొండా జాతి ప్రజలు ఎక్కడున్నారు.. వాళ్ల జీవన శైలి ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం.
అరకు వేలీ నుంచి జైపూర్ వెళ్లే రోడ్డులో 62 కిలోమీటర్లు ప్రయాణిస్తే లంప్టపుట్ అనేగ్రామం వస్తుంది. అక్కడ నుంచి ఎడమ చేతి వైపు 25 కిలో మీటర్లు వెళ్తే ఒనక ఢిల్లీ వస్తుంది. ప్రతీ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇక్కడ సంత జరుగుతుంది. ఒడిశాలోని అనేక ఆదిమ జాతుల్లో ఒకటైన బొండా జాతి గిరిజనులు ఈసంతకు వస్తారు. తేనె, అడవి దుంపలు, రకరకాల మత్తు పానీయాలను తీసుకొచ్చి వస్తు మార్పిడి పధ్ధతుల్లో అమ్ముతుంటారు. ఊరికి సుమారు 50 కిలో మీటర్ల దూరంలోని కొండ ప్రాంతంలోంచి నడుచుకుంటా వస్తుంటారు.
స్త్రీలు తమకన్నా 15 ఏళ్లు చిన్నవాళ్లను వివాహమాడతారు
ఈ సంతకి విదేశాల నుంచి టూరిస్టులు చూడటానికి వస్తుంటారు. బొండా జాతి స్త్రీలు తమకంటే వయసులో 15 ఏళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకుంటారు. ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు. ఒక మనిషి హోదాని ఆమెకున్న ఆవులను బట్టి లెక్కగడతారు.
సుమారు పాతికేళ్ల క్రితం వరకు వీళ్లు బట్టలు లేకుండానే తిరిగేవాళ్లట. ఒడిశా ప్రభుత్వం బొండా డెవలప్మెంటట్ అధారిటీని ఏర్పాటు చేసింది. వీళ్లలో కొంత మార్పు తీసుకొచ్చారు. ఇప్పటికీ జంతువులను వేటాడి కాల్చుకుని తింటుంటారు. ఉప్పు, కారం, నూనెలు అత్యంత ప్రమాదకరమైనవని వీళ్ల నమ్మకం.
వీళ్ల గ్రామాల్లో పురుషులకు మాత్రమే ప్రవేశం
వీళ్ల గ్రామాల్లో ఒక రాత్రి నివసించాలంటే లోకల్ గైడ్ ను సంప్రదించాలి. సుమారు 30 కిలోమీటర్లు కాలి నడకన కొండ కోనల్లో ప్రయాణం చేస్తే వారి మొదటి గ్రామం వస్తుంది. పురుషులకు మాత్రమే ప్రవేశం. అక్కడకు వెళ్లిన తర్వాత ఆరోజు వేటలో దొరికిన అడవి జంతువుల మాంసం, మత్తు పానీయాలు మనకు ఉచితంగా అందిస్తారు.

సుమారు 40 ఏళ్ల క్రితం జర్మనీ నుంచి వచ్చిన ఓ ఆంత్రొపాలజిస్ట్ కొన్ని సంవత్సరాలు వీళ్లతో కలిసి జీవించాడు. వాళ్ల భాష నేర్చుకొని స్థానిక మహిళతో సహజీవనం చేసి పిల్లలను కన్నాడు. తర్వాత ఆమెను జర్మనీ తీసుకెళ్లాడు. అప్పుడప్పుడూ ఆమె భర్తతో కలిసి తన జాతి ప్రజలను కలుసుకోవడానికి వస్తుంటుంది. ఇప్పటికీ ఆమె వస్త్ర ధారణ మారలేదు. అక్కడికెళ్లినోళ్లకు జర్మన్ బ్రీడ్ ఇప్పటికీ కనబడుతుంది.
మాంసం.. మత్తు పానీయాలే ఆహారం
బొండా జాతి ప్రజల ప్రధాన ఆహారం మాంసం, మత్తు పానీయాలు. ఫొటోలు తీయడానికి ఇష్టపడరు. ఓ పది రూపాయలు ఇస్తే కొంత మంది ఫొటోలు తీయడానికి అంగీకరిస్తారు. వాళ్ల నివాస ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాల్లేవు. త్వరలో ఈ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది గ్రహించిన ఓ స్వచ్చంద సంస్థ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. కొందరు బొండా జాతి యువతకు ఏఎన్ఎం శిక్షణ ఇప్పిస్తోంది. ఒడిశా ప్రభుత్వం బొండా గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలి.
ఈ రూట్లో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. డుమా జలపాతం, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం చూడొచ్చు. అరకు నుంచి జనక ఢిల్లీకి రోడ్డు చాలా బావుంటుంది. 88 కిలోమీటర్ల దాకా ఇక్కడ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పనిచేస్తుంది.
Credits : Pasalapudi Vamsy
Share and Contribute can also rs.100. Encourage Independent Journalism
