ఏపీలో ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. వైసీపీ ముందస్తుకెళ్తే అది వేరే సంగతి. ఇప్పుడే ఎన్నికల ప్రచారాన్ని తలపించేట్లు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఓటింగ్ పరంగా మూడో స్థానంలో ఉన్న జనసేన పార్టీ అనూహ్యంగా ముందుకు తోసుకొచ్చింది. ఒక్క చాన్స్ ఇస్తే తానేంటో చూపిస్తానని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఇంకొక్కసారి అవకాశమిస్తే సంక్షేమం.. అభివృద్ధి అంటే ఏంటో నిరూపిస్తామని వైసీపీ నేతలు అడుగుతున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే ఏం చేస్తున్నారో చూశారుగా. అందుకే తిరిగి మళ్లొక్క దఫా టీడీపీకి పట్టం కట్టాలని చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ప్రజల వద్దకెళ్తున్నారు. ప్రజలు మాత్రం మనసులో ఏముందో బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు.
మొదటి నుంచి ఏదో ఆర్నెల్లకో.. ఏడాదికో అలా కనిపించే జనసేనాని పవన్ కల్యాణ్ ఈ మధ్య జోరు పెంచారు. అధ్వాన్నస్థితికి చేరిన గుంతలపై సమరం మొదలెట్టారు. జనసైనికులు ఎక్కడ గుంతలున్నా చారెడు మట్టిపోసి పూడ్చే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. వెంటనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రోడ్ల మరమ్మతులకు పూనుకుంది. ఇంకా సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు.
కౌలు రైతు భరోసా యాత్రతో జనసేన మరింతగా జనంలోకి
వెంటనే కౌలు రైతుల భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పుల బాధ తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడిన సుమారు 3 వేల కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. కుటుంబానికి లక్ష చొప్పున సాయమందిస్తున్నారు. రూ.7 లక్షల పరిహారాన్ని ప్రతీ కుటుంబానికి చెల్లించాల్సిందేనని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు.
పరిహారం అందించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. దీనిపై జగన్ సర్కారులో స్పందన లేదు. జన సైనికులు ఇంతటితో ఆగలేదు. ప్రతీ సమస్యపై జనం దగ్గరకు వెళ్తున్నారు. జగన్కు మాదిరిగా ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను అర్ధిస్తున్నారు.
ఒక్కసారి చాన్స్ ఇచ్చినందుకు బాదుడే బాదుడు–టీడీపీ
ఇక టీడీపీ వైసీపీ సర్కారు వైఫల్యాలపై ఎక్కు పెట్టింది. ఒక్కసారి అవకాశమిస్తే ఏం చేశారో చూడండని ఆ పార్టీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలతో ప్రజలను బాదేస్తున్నారంటూ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. పెంచిన రవాణా, విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చివరకు చోరీల్లో రికవరీ అయిన సొమ్మును కూడా ప్రభుత్వం వాడేసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాలకు మూడేళ్ల నుంచి డబ్బులు ఇవ్వని సీఎం జగన్కు పాలించే అర్హత లేదంటున్నారు. విధ్వంసకర విధానాలతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన వైసీపీ సర్కారును తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మళ్లొక్క దఫా టీడీపీకి అవకాశమివ్వాలని కోరుతున్నారు.
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ రావాలి
అధికార వైసీపీ కూడా గడప గడపకూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఉక్రోషంతో ఉడికిపోతున్న పార్టీ కార్యకర్తలు సహకరించరని భావించి ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేసింది. ప్రస్తుతం నడుస్తోన్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే ఇంకొక్కసారి జగన్ను గెలిపించుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రజలను అర్ధిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు.. గృహ నిర్మాణం కొనసాగాలంటే మళ్లీ వైసీపీ సర్కారుకు పట్టం కట్టాలని జనాన్ని అడుగుతున్నారు. ఇప్పటిదాకా చేపట్టిన పథకాల గురించి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
అక్కడక్కడా అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి ఎదురు దాడిని చవిచూడాల్సి వస్తోంది. దాదాపుగా ఎక్కడా కూడా జనం నోరు విప్పడం లేదు. అన్ని పార్టీల నేతలు చెప్పేది వింటున్నారు. నోరు విప్పితే జీడిపాకం సీరియళ్ల మాదిరిగా నడుస్తోన్న సంక్షేమ పథకాలు ఇవ్వరేమోననే భావన కావొచ్చు. వీళ్లతో మనకెందుకు గొడవ ! ఓటు వేసేటప్పుడు చూసుకుందామనే ఆలోచన కావొచ్చు. మొత్తంగా ప్రజలు తమ మనసులో ఏముందో బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికల దాకా ఇదే సీన్ కొనసాగవచ్చని తెలుస్తోంది.
Share and Contribute. Encourage Independent Journalism
