ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఓ నానుడి ఉండేది. రాయపాటి.. ఆలపాటి.. కన్నాలాంటి ప్రభృతులు రాజకీయాలను శాసించేవారట. ఏ పార్టీలో ఎవరు పోటీ చేయాలి.. ఏ పార్టీలో ఎవరు గెలవాలనేది డిసైడ్ చేసేవాళ్లట. వీళ్ల ఐక్యతకు రాజకీయ పార్టీల అగ్ర నేతలు నోరెళ్లబెట్టినట్లు చెప్పుకుంటుంటారు. అలాంటి ఓ రెండు నియోజకవర్గాలను ప్రస్తుత బాపట్ల జిల్లాలో చూడొచ్చు. అవే అద్దంకి.. పర్చూరు నియోజకవర్గాలు. ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా గెలిచేది మాత్రం గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు మాత్రమేనని వింతగా చెప్పుకుంటున్నారు. అదెలా సాధ్యమవుతుందో ఓ లుక్కేద్దాం !

అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవి కుమార్ ఇప్పటికి మూడు సార్లు విజయం సాధించారు. మార్టూరు నుంచి ఓసారి గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం పై గెలిచారు. 2019లో జగన్ గాలి వీస్తున్నా బాచిన చెంచుగరటయ్యపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనైనా ఇక్కడ బావుటా ఎగరేసేది రవికుమార్ మాత్రమేనని టీడీపీ కార్యకర్తలు చెప్పడం సహజం. అదేంటో వైసీపీ వర్గాల్లోనూ అదే అభిప్రాయం నెలకొంది.
మళ్లీ పర్చూరు ఏలూరిదే

ఇక పర్చూరు నియోజకవర్గం నుంచి 2014లో ఏలూరి సాంబశివరావు వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్‌పై విజయం సాధించారు. అదే 2019 ఎన్నికల్లో జగన్ చరిష్మాను అధిగమించి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా సాంబశివరావు గెలుస్తారనే విశ్వాసం టీడీపీ వర్గాల్లో పెల్లుబుకుతోంది. విశేషమేమంటే వైసీపీ వర్గాల్లోనూ ఇదే అభిప్రాయం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎందుకిలా జరుగుతోందని టీడీపీ కార్యకర్తలను అడిగితే.. వీళ్లిద్దరూ క్షేత్ర స్థాయిలో నిరంతరం ప్రజలతో మమేకమవుతుంటారు. ఎవరికి ఏ చిన్న సమస్య ఎదురైనా తామున్నామనే భరోసానిస్తారు. ప్రత్యేకించి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఏ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం వీళ్లదేనని ఢంకా బజాయిస్తున్నారు.
వైసీపీలోనూ వీళ్లద్దరి పేర్లు చెప్పడం విశేషం
అదే వైసీపీ వర్గాలను ఆరా తీస్తే.. గడచిన రెండు ఎన్నికల్లోనూ ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ధీటైన అభ్యర్థులను బరిలో దించడం లేదు. ప్రజల్లో లేని వాళ్లకు టిక్కెట్లు ఇస్తున్నారు. అప్పటిదాకా పనిచేసిన ఇన్చార్జులను పక్కకునెట్టేసి చివరి నిమిషంలో వేరే వాళ్లను పోటీకి దింపుతున్నారు. దీంతో ప్రజలు వాళ్లిద్దర్నే కోరుకుంటున్నారు. పైగా ఈ ఇద్దరు నాయకులకు ప్రకాశం జిల్లాలోని వైసీపీ సీనియర్ నేతకు మంచి సంబంధాలున్నాయి. ఇక ఇంతకన్నా చెప్పేదేముంటుందని మర్మగర్బంగా వెల్లడించారు.
ఇప్పటిదాకా చోటుచేసుకున్న పరిణామాలు వాళ్ల వాదనకు బలాన్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో పర్చూరు ఇన్చార్జిగా ఉన్న రావి రామనాధంబాబును కాదని చివరి నిమిషయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావును బరిలో దింపారు. రామనాధంబాబు టీడీపీలో చేరారు. మళ్లీ వైసీపీలోకి తీసుకొని ఆయన సతీమణికి డీసీఎంఎస్ చైర్మన్ పదవిచ్చారు. మూడేళ్ల నుంచి నియోజకవర్గ ఇన్చార్జిగా రామనాధంబాబు కొనసాగుతున్నారు.
రామనాధం బాబు పరిస్థితేమిటి !
ఇప్పుడు అకస్మాత్తుగా రామనాధంబాబును తప్పించి గాదె వెంకటరెడ్డి తనయుడు మధుసూదన్‌రెడ్డికి ఇవ్వాలా.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచికి ఇవ్వాలా అని తర్జనబర్జన పడుతున్నారు. సీఎం జగన్ సర్వేల్లో చాలా మెరుగ్గా ఉన్న రామనాధం బాబును పక్కనపెట్టారు. అత్యంత తక్కువ మార్కులొచ్చిన బాచిన కృష్ణ చైతన్యను అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిస్తున్నారు.
ఈ ఆంతర్యమేమిటని వైసీపీ కార్యకర్తలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఏదిఏమైనా ఎమ్మెల్యేలు గొట్టిపాటి, ఏలూరి ఘనాపాటీలే. ఒంగోలు ఎంపీ మాగుంటలాగా అజాత శత్రువులుగా ఎదిగారు. ఇవన్నీ చూస్తుంటే రాజకీయాల్లో విశ్వసనీయత.. విలువలు తీసుకొస్తామన్న పార్టీ వాటికి కొత్త భాష్యం చెబుతున్నట్లుంది.
Share and Contribute Rs.100
Encourage Independent journalism
