జనసేనాని కౌలు రైతు సమస్యల తేనెతుట్టెను కదిపారు. అక్కడ నుంచి ఈగలన్నీ పైకి లేచాయి. ఇక ఎటు పోవాలో అర్థం కాని డైలమాలో పడ్డారు. ఇప్పటిదాకా ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఇచ్చి తానున్నానంటూ భరోసానిచ్చారు. ఇప్పుడు పటిష్టమైన కౌల్దారీ చట్టం విధి విధానాలు ఎలా ఉండాలో చెబితే భూ యజమానులకు కోపం వస్తుందేమో.. ఇరువురికి ఆమోదయోగ్యమైంది.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా ముందుకెళ్లాలనే మీమాంసలో పడినట్లుంది. పార్టీ క్యాడర్ మొత్తం తర్వాతేంటి అన్నట్లు ఎదురు చూస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 శాతానికి పైగా కౌలు సాగే నడుస్తోంది. అందులోనూ 60 శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం. తెలుగు ప్రజల ఆహార భద్రతకు సంబంధించిన కీలక అంశం. ఇప్పటిదాకా ప్రభుత్వాలు కౌలు చట్టాల గురించి దోబూచులాడుతూ వస్తున్నాయి.
కౌలు రైతు సమస్యలకు బ్రాండ్ అంబాసిడర్ పవన్
ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు సమస్యలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. కొన్ని అడుగులు ముందుకు పడ్డాయి. ఇక్కడ నుంచి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై తర్జన బర్జనలు పడుతున్నట్లుంది.
ప్రస్తుతం ఏపీ కౌల్దారీ చట్టంలో ఉన్న లోపాల్లో ప్రధానమైంది భూయజమాని అంగీకార పత్రం. అభద్రతా భావంతో భూయజమానులు అంగీకరించరు. కాదుకూడదనుకుంటే బంధువులో.. మిత్రుల పేర్లనో కౌలు రైతులుగా నమోదు చేయిస్తారు. ఇప్పటిదాకా జరుగుతుంది ఇదే.
ఇక్కడ ప్రభుత్వ జోక్యం ఎక్కడా లేదు. అందువల్లే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరుగుతున్న కౌలు ధరలు, సంస్థాగత పంట రుణాలు.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పరిహారాలు అందకపోవడం, మద్దతు ధరకు పంటను అమ్ముకోలేకపోవడమనే సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వమే భూమిని లీజుకు తీసుకొని కౌలుకు ఇవ్వాలి
అందుకే కట్టుదిట్టమైన కౌల్దారీ చట్టాన్ని రూపొందించాలి. ప్రభుత్వమే వ్యవసాయం చేయని భూ యజమానుల నుంచి భూమిని లీజుకు తీసుకోవాలి. తిరిగి కౌలు రైతులకు లీజుకు ఇవ్వాలి. ఇలా ఓ ల్యాండ్ బ్యాంకును అమలు చేయాలి.
ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న కౌలు రైతుకు బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇప్పించాలి. వివిధ పంటలకు అయ్యే పెట్టుబడులను అంచనా వేసి పంట రుణాల పరిమితిని పెంచాలి. తిరిగి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసే బాధ్యతను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం తీసుకోవాలి. కౌలు ధరను ప్రభుత్వమే నిర్ణయించాలి.
వ్యవసాయ శాఖను కౌలు సాగు శాఖగా మార్చాలి
ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర యంత్ర సామగ్రిని అందించాలి. పంటల బీమా అనేది ప్రతీ రైతు వారీ సాగు చేసే భూమిని పరిగణనలోకి తీసుకొని పరిహారం చెల్లించేట్లుండాలి. వ్యవసాయ శాఖను కౌలు సాగు శాఖగా మార్చాలి. ప్రభుత్వం ఇంత క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే ఒక ఏడాది సాగు చేసిన కౌలు రైతు మరుసటి ఏడాది మళ్లీ పంటలు సాగు చేయగలడు. అప్పుడే వ్యవసాయం బతికి బట్టకట్టగలుగుతుంది.
రాష్ట్రంలో 35 లక్షల మంది కౌలు రైతుల కీలక సమస్య ఇది. అందులో సెంటు భూమిలేని 18 లక్షల మంది కౌల్దార్లలో 80 శాతం ఎస్సీఎస్టీబీసీ మైనార్టీలే ఉన్నారు. కుటుంబానికి నాలుగు ఓట్లున్నా 1.40 కోట్ల మంది ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఇది. కౌల్దారీ చట్టాన్ని ఇలా అమలు చేయాలని జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అందుకోసం కౌలు రైతులను సంఘటిత పోరాటానికి సిద్ధం చేయాలి. ఇది కేవలం కౌలు రైతుల సమస్యే కాదు.. జనసేన పార్టీ జీవన్మరణ సమస్య కూడా. రెడీ అవుతారా జనసేనాని !
Share and contribute Rs.100
Encourage Independent Journalism
