“ ఎన్నికల ముందు బీజేపీకి.. కాంగ్రెస్కు తాము వ్యతిరేకమన్నారు. ఇప్పుడేమో కేంద్రం కాళ్ల మీద సాగిలపడుతున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్నారు. 22 మంది ఎంపీలను పెట్టుకొని బీజేపీకి సరెండర్ కావడమేంటీ ! ఇలాగే ఉంటే ఈసారి మా దోవ మేం చూసుకుంటాం !” వైసీపీకి చెందిన ఓ ముస్లిం కార్యకర్త ఆక్రోశం ఇది. దేశ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్న బీజేపీతో లోపూచీ వ్యవహరాన్ని జీర్ణించుకోలోక పోతున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీతో కొనసాగలేమని కుండ బద్దలు కొడుతున్నారు.
రాష్ట్ర జనాభాలో సుమారు 14 నుంచి 16 శాతం ముస్లింలున్నారు. వీళ్లంతా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఆది నుంచి ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపుండేది. గత ఎన్నికల్లో అధిక శాతం వైసీపీకి మద్దతుగా నిలిచారు. బీజేపీ మెడలు వంచి అయినా ప్రత్యేక హోదా సాధిస్తామని నాడు వైఎస్ జగన్ చెప్పిన మాటలు కూడా ముస్లింలలో కొంత అండగా ఉంటారనే భావన నెలకొంది.
దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఘటనలపై వైసీపీ నేతలు కనీసం నోరెత్తకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముల్లాలు, మౌజన్లకు గౌరవ వేతనం ఇస్తున్నా ఇప్పుడు ముస్లింల అస్తిత్వమే ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్నారు.
క్రిస్టియన్లూ దూరమవుతున్నారు..
ఇక క్రిస్టియన్ మైనార్టీలు ఈపాటికే తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో క్రిస్టియన్లలో ఆందోళన మొదలైంది. ఇప్పటిదాకా క్రిస్టియన్లలో ఎక్కువ శాతం వైసీపీకి మద్దతుదార్లుగా ఉన్నారు. గడచిన మూడేళ్లలో వైసీపీ సర్కారు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు గులాముగా మారడాన్ని క్రిస్టియన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్నా వారిలో ఆందోళనను తగ్గించలేకపోతోంది.
ప్రధానంగా క్రిస్టియన్లలో 90 శాతం దళిత, గిరిజన, బీసీలే ఉన్నారు. ఇప్పటిదాకా ఈ వర్గాలకు కేటాయించిన సంక్షేమ నిధులను దారి మళ్లించారనే ఉక్రోషం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాల పెద్దలు తామిక వైసీపీతో కొనసాగలేమని ఇటీవల బ్రదర్ అనిల్ కుమార్ ఎదుట స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరెస్సెస్ దూకుడుకు కళ్లెం వేయలేకపోయారనే భావన కూడా నెలకొంది. ఇవన్నీ వైసీపీకి దూరంగా వెళ్లేందుకు దారితీస్తున్నాయి.
నిరంతరం పెరుగుతున్న ధరలతో వ్యతిరేకత
దేశ వ్యాప్తంగా కాషాయ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతున్నందుకు తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి.
జీఎస్టీతో నిత్యావసరాల ధరలు తగ్గుతాయని చెప్పిన నీతి అయోగ్ మాటలు వట్టి అబద్దాలేనని జనం మండిపడుతున్నారు. మరోవైపు అంబానీ, అదానీ ప్రయోజనాల కోసం బొగ్గు కొరత సృష్టించి కరెంటు కోతలకు, చార్జీల పెంపునకు కారణమయ్యారని రగిలిపోతున్నారు. మొత్తంగా కాషాయ ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి తప్పదేమో !
ఈ వర్గాలను దగ్గర చేసుకునే ఎత్తుగడలో కాంగ్రెస్
ఈపాటికే బీజేపీతో పొత్తును జనసేన పార్టీ కొనసాగిస్తోంది. అందువల్ల ముస్లిం మైనార్టీ వర్గాలు అటువైపు చూసే అవకాశమే లేదు. టీడీపీ పొత్తు పెట్టుకున్నా ఈ రెండు వర్గాలు ఆ పార్టీకి దూరమవడం ఖాయం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డికి బదులు గుంటూరుకు చెందిన మస్తాన్ వలికి ఇస్తే ఎలా ఉంటుందనేది కూడా ఆలోచిస్తోంది. ఈ దఫా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు బలంగా ముందుకొస్తే వాళ్లకే ముస్లిం మైనార్టీ ల మద్దతు ఉంటుందని భావిస్తున్నారు.
Share and contribute Rs.100
Encourage Independent Journalism
