తలలోని మెదడు మోకాల్లోకి జారితే ఇంతే. ఇలాంటి ఐడియాలే వస్తుంటాయి. ఆర్టీసీ బస్సుకు నిర్దేశించిన మైలేజ్ రాకుంటే డ్రైవర్ జీతం నుంచి కట్ చేస్తారట. అదనంగా ఖర్చయిన డీజిల్ సొమ్మును డ్రైవర్ వేతనం నుంచి రాబట్టాలనే ఆలోచన వచ్చినోళ్లకు జోహార్లు. ఇప్పటిదాకా ఉద్యోగులు, టీచర్లే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు కూడా నిరసన గళం విప్పుతున్నారు.
విశాఖ జిల్లా సింహాచలం బస్సు డిపోలో పనిచేసే డ్రైవర్ ఈవీఎన్ రాజు ఏప్రిల్ నెలలో 4,202 కిలోమీటర్ల మేర బస్సు నడిపారు. 5.16 కిలోమీటర్ల లెక్కన మైలేజి వచ్చిందట. ఆయనకు కేటాయించిన రూట్లో ఓ లీటరు డీజిల్‌కు ఆరు కిలోమీటర్లు రావాలట. దీంతో 115 లీటర్ల డీజిల్ అదనంగా ఖర్చు చేసినందుకు రూ.12,077 ఆయన జీతం నుంచి ఎందుకు మినహాయించకూడదో వారంలోగా సమాధానం ఇవ్వాలని డిపో మేనేజరు నోటీసు జారీ చేశారు. సదరు డిపో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.2.05 కోట్ల నష్టంలో ఉన్నందున ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మైలేజీ రాకపోవడానికి బోలెడు కారణాలున్నాయి
“ ప్రయాణికులు ఎక్కడ చెయ్యత్తి ఆపమంటే అక్కడ ఆగి ఎక్కించుకొని పోవాలి. పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సులకు తప్పదు. ఇక గ్రామీణ రోడ్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు రెండు లేదా మూడో గేర్‌లోనే బండి నడపాల్సి వస్తోంది. మైలేజ్ ఎలా వస్తుంది. నిర్దేశించిన మైలేజ్ రాకుంటే డ్రైవర్ ఎలా కారణమవుతాడు. ఇలాంటి దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించం. ప్రభుత్వంతో తాడే పేడో తేల్చుకుంటాం !” అంటూ గుంటూరు డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
అసలు ఆర్టీసీ నష్టాలకు కారకులెవరు ? అధికారులు నిర్దేశించిన మైలేజీ రాకపోవడానికి కారణాలు బోలెడుంటాయి. బస్సు కండిషన్ సరిగ్గా ఉండాలి. గుంతల్లేని రోడ్లుండాలి. బస్సు టైర్లు సక్రమంగా ఉండాలి. ఇవన్నీ బావున్నా సరే. ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులు ప్రయాణికులు చెయ్యెత్తిన చోటల్లా ఆపి ఎక్కించుకోవాలి. అందువల్ల ముందుగా అధికారులు నిర్దేశించినంత మైలేజీ రాకపోవచ్చు. దీనికి డ్రైవర్ ఎలా బాధ్యుడవుతాడు !
ప్రభుత్వ నిర్ణయాలే ఆర్టీసీని నష్టాల్లోకి తోసేస్తున్నాయి
ప్రభుత్వ విధాన నిర్ణయాలే ఆర్టీసీని నష్టాల్లోకి తోసేస్తోంది. ప్రభుత్వం వివిధ వర్గాలకు చార్జీల్లో ఇస్తున్న రాయితీలను ఆర్టీసీకి కొన్నేళ్ల తరబడి రీయింబర్స్ చేయడం లేదు. టైర్ల రీట్రేడింగ్‌లో కోట్ల సొమ్ము దోచేస్తున్నారు. అద్దె బస్సులపై ఉన్న ప్రేమ సంస్థ వాహనాలపై లేదు. అసలు బస్సుల కొనుగోలులోనే బోలెడు నొక్కేస్తున్నారు. చివరకు ప్రజా రవాణాకు వినియోగించే డీజిల్‌పై కూడా వ్యాట్ తగ్గించకుండా బాదేస్తున్నారు.
ఏనుగులు దూరే కంతలు వదిలేసి ఇలా రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునే డ్రైవర్ కష్టార్జితానికి ఎసరు పెట్టడం తగునా ! కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల చాలా నష్టపోయామని కార్మికులు, ఉద్యోగులు భావిస్తున్నారు. ఇప్పుడు ఇలా వేతనాల్లో కోతలు పెడితే పాలాభిషేకాలు చేసిన వాళ్లు ఇంకేం చేస్తారో మరి. ఇప్పటికైనా కార్మికుల కడుపు కొట్టే చర్యలను ఉపసంహరించుకోవాలి.
– సయ్యద్ మున్వర్ బాషా
Share and contribute Rs.100
Encourage Independent Journalism
