నేడు దేశంలో తరతరాల నుంచి కూడబెట్టిన ప్రజల ఆస్తులు కార్పొరేట్ల పరమవుతున్నాయి. పాలక ప్రభుత్వాలు ఈ క్రతువును దగ్గరుండి నిర్వహిస్తున్నాయి. కోటానుకోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా తాబేదార్లకు కట్టిపెట్టేస్తునాయి. అధిక భారాలతో ప్రజల మూలిగలు పీలుస్తూ కొద్ది మంది కుబేరుల ఆస్తులు పెంచుతున్నాయి. ప్రజల కనీస అవసరాలన్నింటిలోకి కార్పొరేట్ల పెత్తనానికి అవకాశమిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గపు విధానాలను ఎండగట్టి ప్రజల్లో నిరంతర చైతన్య స్ఫూర్తిని రగిలించేది స్వతంత్ర మీడియానే.
ఒకప్పుడు స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో పురుడు పోసుకున్న జర్నలిజం నేడు కార్పొరేట్ల చేతిలో బందీ అయింది. అర్థసత్యాలు.. అసత్యాలతో ప్రజల అభిప్రాయాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. కార్పొరేట్ జీవన శైలికి లాక్కెళ్తున్నాయి. మానవీయతను పాతరేసి మనిషిని వినిమయ సంస్కృతికి గులాము చేస్తున్నాయి.
ఖండాంతర వాణిజ్య సంస్థలకు ప్రజలను వినియోగదారులుగా మలిచేస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు విదిల్చే కాసులతో గద్దెనెక్కిన పాలక ప్రభుత్వాలు ప్రజలను వాటికి నయా బానిసలుగా మార్చేస్తున్నాయి. ఈ అమానవీయ విధానాలను తుత్తినియలు చేసే స్వతంత్ర మీడియా మనకు కావాలి.
ఇక అంతా డిజిటల్ మీడియానే
పత్రికలు ఉనికి కోల్పోయాయి. టీవీలు యూ ట్యూబ్‌లోకి వచ్చేశాయి. ఇప్పుడు మీడియా మొత్తం డిజిటలైజ్ అయ్యింది. సోషల్ మీడియా వేగంగా దూసుకొచ్చింది. మొబైల్ ఫోనులో మీడియా ఇమిడిపోయింది. దీన్ని కార్పొరేట్ రంగం సొంతం చేసుకుంటోంది.
ఈపాటికే అంబానీ గుత్తాధిపత్యం కోసం వెంపర్లాడుతున్నాడు. ఇప్పుడు అదానీ కూడా వచ్చేస్తున్నాడు. ఇక ఏ వార్తల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో ప్రజలు తెలుసుకునే అవకాశమే లేకుండా పోతుంది. జనం కోసం ఎలుగెత్తిన జర్నలిజానికి పాతరేసి కాపీ రైట్ వచ్చేసింది.
అసమానతలపై ఎలుగెత్తే స్వతంత్ర మీడియా కావాలి
ఇప్పటిదాకా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జాతీయ ఆదాయంలో 70 శాతం కేవలం పది శాతం మంది చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడ సంపన్నులు ప్రపంచ కుబేరులతో పోటీపడుతుంటే.. పేద మధ్యతరగతి ప్రజలు మరింత నిరుపేదలవుతున్నారు.
రాజకీయ పార్టీలు ప్రజల్లో మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టి అధికార పీఠమెక్కుతున్నాయి. సగటు ప్రజలపై అధిక భారాలు మోపి నయా బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీళ్ల అరాచకాలపై ప్రజలను నిరంతరం జాగృతం చేసే స్వతంత్ర మీడియాను నిలబెట్టుకోవాలి.
స్వతంత్ర మీడియాకు బాసటగా నిలవాలి
ఎందరో విలువలు కలిగిన జర్నలిస్టులు కార్పొరేట్, రాజకీయ పార్టీలకు కొమ్ముగాస్తున్న పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా నుంచి తట్టుకోలేక బయటకు వస్తున్నారు. స్వతంత్రంగా డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై తమ కలాలతో విజృంభిస్తున్నారు. ప్రజల ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఈ కోవలోనే ‘తెలుగిల్లు’ డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టింది. పెట్టుబడులు లేకున్నా ప్రజలు ఇచ్చే వితరణతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.
ఎలాంటి లాభాపేక్ష లేని ఇండిపెండెంట్ డిజిటల్ మీడియా ఫౌండేషన్ ద్వారా ‘తెలుగిల్లు’ మరింత వేగంగా ప్రజల అభిమానాన్ని చూరగొంటోంది. పాలక ప్రభుత్వాల నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో నిష్పక్ష కథనాలు అందిస్తోంది. ప్రజల్లో సమానత్వ భావాలను ప్రోది చేసే మానవీయ కథనాలకు ప్రాణం పోస్తోంది.
నవతరాన్ని సమున్నతంగా నిలిపేందుకు సునిశిత రచనలతో నిరంతరం శ్రమిస్తోంది. అసమానతలపై అలుపెరగని పోరాటం చేస్తోంది. మేమున్నామంటూ సగటు ప్రజలు తమ కష్టార్జితంలో కొంత వితరణ చేస్తున్నారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇలాగే ‘తెలుగిల్లు’కు సహాయ సహకారాలను కొనసాగిస్తారని ఆశిస్తున్నా.
Ch KV Nath,
Editor, Telugillu.com
Founder cum Chairman,
Independent Digital Media Foundation
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
