కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించింది. లీటరు పెట్రోలుకు రూ.8, డీజిల్‌కు రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. ఇంకా గృహ నిర్మాణానికి ఉపశమనం కోసం ప్లాస్టిక్, స్టీల్, ఇతర ముడి సరకులపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ పొందుతన్న వారికి రూ. 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ ఏపీలో ఎవరి ఖాతాలో వేసుకుంటారనే చర్చ జనంలో మొదలైంది. ఈ క్రెడిట్స్ ఏ పార్టీకి వెళ్తాయనే దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి.
పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన నోరు మెదపలేదు. ధరలు పెంచుతున్నదంతా వైసీపీనే అంటూ టీడీపీ బద్నాం చేసింది తప్ప బీజేపీని పల్లెత్తు మాట అన్లేదు. మిత్ర పక్షం అయినందున జనసేనాని నోరు విప్పలేదు. అందువల్ల ధరల తగ్గింపు వల్ల ప్రజల్లోవచ్చే సానుకూలతను వీళ్లెవరూ పొందలేరు. అది వస్తే గిస్తే వామ పక్షాలకు రావొచ్చు. లేదా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించి ధరలు తగ్గించామంటున్న బీజేపీకి ఈ క్రెడిట్ దక్కుతుంది.
మరి పెట్రోలు, డీజిల్ ధరలతో పెరిగిన నిత్యావసరాల మాటేమిటి ! వాటి ధరలు కూడా తగ్గించాలి కదా ! అప్పుడే కదా సామాన్య జనానికి ప్రయోజనం. 5 నుంచి 12 శాతానికి చేరిన జీఎస్టీ శ్లాబు కూడా వెనక్కి రావాలి. గతంలో రవాణా చార్జీలు పెరిగినందున నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. ఇప్పుడు ఖర్చు తగ్గిన మేర ధరలు తగ్గించేట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా ! అప్పుడే కదా సగటు ప్రజలకు ఉపశమనం కలిగేది.
ఇక గృహ నిర్మాణానికి ఉపశమనం కలగాలంటే కేవలం దిగుమతి సుంకాలు తగ్గిస్తేనే సరిపోదు. దేశీయంగా డిమాండ్ ఉన్న స్టీల్‌ను చైనాకు ఎగుమతులను నిలువరించాలి. స్టీల్ ఎగుమతుల ప్రోత్సాహకాలను నిలిపేయాలి. సిండికేటయిన సిమెంటు కంపెనీలకు దిగుమతి సుంకాల తగ్గింపుతో ఏమేరకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుందో ఆమేర ధరలు తగ్గించేట్లు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్లాస్టిక్‌తోపాటు ఇతర ముడిసరకుల ధరల తగ్గింపునకు ప్రత్యేక చర్యలు ఉండాలి.
అసలు పెంచింది ఎంత.. తగ్గిస్తున్నది ఎంతని విపక్షాలు నిలదీస్తున్నాయి. పెంచింది కొండంత.. తగ్గించింది గోరంతని దుయ్యబడుతున్నాయి. త్వరలో గుజరాత్ ఎన్నికలు ఉన్నందున ధరలు కొంత మేర తగ్గించినట్లు విపక్షాలు అంటున్నాయి.
ధరల తగ్గింపు ప్రయోజనం ఎంతయినా సరే ప్రజలకు చేరితే తెలంగాణలో బీజేపీ మరింత బలం పుంజుకుంటుంది. దీన్ని ఓ అస్త్రంగా ప్రయోగించి సీఎం కేసీఆర్ రాష్ట్ర పన్నులు తగ్గించాలని డిమాండ్ చేయొచ్చు. అలాగే ఏపీలో సీఎం జగన్‌ను ఇరకాటంలో పెట్టడానికి దోహదపడవచ్చు.
కమలనాధుల ఎత్తుగడలు అంత తేలిగ్గా అర్థం కావు. ప్రజలందరి దృష్టిని ఓవైపునకు మళ్లిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేస్తుంటారు. ఇప్పుడు ధరల తగ్గింపు వెనుక మర్మమేమిటని విశ్లేషకులు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
