వైసీపీ సర్కారు మెడపై కరెంటు కత్తి వేలాడుతోంది. విద్యుత్ రంగంలో ప్రభుత్వం ముందుకెళ్తే నుయ్యి.. వెనక్కి వెళ్తే గొయ్యిలా తయారైంది. అధికారానికి వచ్చిన తొలినాళ్లలో సీఎం జగన్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి పీపీఏలను పున:సమీక్షించాలని భావించారు. న్యాయస్థానాల్లో కేసులు పడ్డాయి. గత టీడీపీ హయాంలో కేంద్రంలోని బీజేపీ అండతో సాగిన దందా అది. కేంద్రం కన్నెర్ర జేయడంతో సీఎం జగన్ కూడా వెనక్కి తగ్గారు. ఈమధ్య సాగు చట్టాలతోపాటు కేంద్ర విద్యుత్ ముసాయిదా చట్టాన్ని కూడా రద్దు చేశారు. అయినా దొడ్డిదోవన విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పేందుకు అడుగులు శరవేగంగా పడుతున్నాయి.
ఇటీవల 500 యూనిట్ల కంటే అధిక వినియోగం కలిగిన సర్వీసులకు ప్రిపెయిడ్ మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లను ఏర్పాటు చేయడానికి సిద్దమైంది. ఆ తర్వాత క్రమేణా గృహాలకూ ప్రిపెయిడ్ మీటర్లు బిగిస్తారు.
తిన్నాతినకున్నా.. కరెండు వాడినా వాడకున్నా ముందుగా డబ్బు చెల్లించి కరెంటు కొనుక్కోవాలి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ప్రీపెయిడ్ మొబైల్ చార్జ్ చేసున్నట్లే. ప్రస్తుతం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వం తొలుత కరెంటు బిల్లు సొమ్ము రైతుల ఖాతాల్లో వేస్తామంటున్నా అది గ్యాస్ సబ్సిడీలా ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు.
ప్రిపెయిడ్ మీటర్లతో ప్రజల్లో వ్యతిరేకత తప్పదు
రాష్ట్ర ప్రజల ఆదాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఉద్యోగులు, కార్మికుల నిజ వేతనాలు పడిపోతున్నాయి. నిత్యావసరాలకు తప్ప మరి దేనికీ రూపాయి వెచ్చించలేని దుస్థితికి చేరింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనానికే తప్ప శాశ్వత ఉపాధితో కూడిన అభివృద్ధికి బాటలు వేయడం లేదు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులు సైతం నెల ఒకటో తేదీన జీతం వస్తుందో రాదోనన్న ఆందోళన నెలకొంది.
ఇలాంటి స్థితిలో ప్రిపెయిడ్ మీటర్లను ప్రవేశపెడితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుంది. ఒక నెలపాటు కరెంటు వాడుకున్న దానికి బిల్లు కట్టమంటే సరే. వాడని కరెంటుకు ముందుగానే డబ్బు చెల్లించి కొనుక్కోమనడం దుర్మార్గం .. అమానవీయం. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఈ దోపిడీని ప్రజలు ఎంత మాత్రం సహించరు.
విద్యుత్ పంపిణీని ప్రైవేటుకు అప్పజెప్పేందుకే
కేంద్రం వద్ద నిరంతరం జోలె పట్టుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు రుణాల మంజూరుతో లింకు పెడుతోంది. ప్రస్తుతం ఉన్న డిస్కంలన్నింటినీ ఉన్నవి ఉన్నట్టుగా ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చెయ్యాలి.
ఆపరేటర్లు చెల్లించే లీజు సొమ్ముతో డిస్కంల అప్పులను ప్రభుత్వం తీర్చాలి. ఎక్కడా రాయితీ కరెంటు ఉండకూడదు. వివిధ సామాజిక వర్గాలకు ఇస్తున్న రాయితీ, పరిశ్రమలకూ ఇది వర్తిస్తుంది. ఈనేపథ్యంలోనే వ్యవసాయ పంపుసెట్లకు ముందుగా మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
విద్యుత్ పంపిణీ రంగం మొత్తం ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. అందుకే డిస్కంల అప్పులు తీర్చడానికి పెద్ద ఎత్తున చార్జీలు బాదేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రెండేళ్లలో చార్జీలు ఇంకా పెరిగే అవకాశముంటుంది. రేపు ప్రైవేటు ఆపరేటర్లు యూనిట్ కు ఎంత చార్జ్ చేస్తారో ఆ స్థాయికి విద్యుత్ చార్జీలు పెంచుతూ పోతారు. ఓ రకంగా ప్రజలను అలవాటు పడేట్లు చేయడమే.
విద్యుత్ చార్జీలు పెంచినా జగన్‌కే ప్రజలు ఓట్లేస్తారు !
అదేమంటే మోడీ నిరంతరం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచితే ఓటు వెయ్యకుండా ఆగలేదు కదా! మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకే ప్రజలు జై కొట్టారు కదా ! ఇక్కడ కూడా అంతే. విద్యుత్ చార్జీలు పెంచినంత మాత్రాన జగన్ సర్కారుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని నొక్కాణించే మేథావులూ ఉన్నారు.
దీనిపై ఓ వైసీపీ నాయకుడ్ని కదిలిస్తే… కారణాలు ఏవైనా సీఎం జగన్ పులి నోట్లో తల పెట్టారు. ఎలా బయటపడతారో తెలీదు. విద్యుత్ రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుంటే అనర్థాలే. మరి ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారో ఏమో అంటూ ఆందోళన వెలిబుచ్చాడు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ అనుభవాలను ఓ సారి పరిశీలించాలి. విద్యుత్ పంపిణీ ప్రైవేటు చేతిలో ఉండడం వల్ల ఎన్ని విపరీత పరిణామాలకు దారితీస్తుందో అవగతమవుతుంది.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
