వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత అనంతబాబును అరెస్ట్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే చంపేశానని అనంతబాబు అంగీకరించాడు.కేసు వివరాలను జిల్లా ఎస్పీ రవీంద్రబాబు వివరించారు. పోలీసులు చెబుతున్న కహానీపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతబాబుకు ఇవ్వాల్సిన బాకీ రూ. 20 వేల గురించి మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంతో ఘర్షణ తలెత్తింది. తోపులాటలో ఒకటికి రెండు సార్లు కింద పడడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సుబ్రహ్మణ్యాన్ని తన వాహనంలో తీసుకెళ్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించడానికి అనంతబాబు ప్రయత్నించాడు. స్థూలంగా పోలీసుల కథనం ఇదే.
ఓ ఎమ్మెల్సీ తనకు ఇవ్వాల్సిన రూ.20 వేల కోసం తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తితో ఘర్షణ పడతారా ! మద్యం తాగిన మాజీ డ్రైవర్‌ను వెంటబెట్టుకొని ఎమ్మెల్సీ స్థాయిలో అనంతబాబు కారెక్కించుకొని ఎందుకు వెళ్లారు ! అసలు రాత్రిపూట అనంతబాబు గన్మెన్లు లేకుండా బయటకు ఒంటరిగా ఎలా వెళ్లారు !
సర్పంచిగా ఉన్నప్పుడే ఎంతో మందికి నగదు సాయం చేస్తుంటాడు. అదీ అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఎందరికో పెద్ద మొత్తాల్లో ఉచిత సాయాలు చేసి ఉంటారు. అలాంటిది తన దగ్గర పనిచేసిన డ్రైవర్‌కు ఇచ్చిన సొమ్ములో రూ. 20 వేలు బాకీ ఉంటే.. దాని కోసం ఒంటరిగా వెళ్లి ఘర్షణ పడతారా… ఇలా అనేక అనుమానాలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి.
ఘర్షణలో గాయాలపాలైన సుబ్రహ్మణ్యాన్ని తన కారులో ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు. చనిపోయే దాకా అనంతబాబు కారులోనే తిప్పుతున్నాడా ! చనిపోయినట్లు గుర్తించి రోడ్డు ప్రమాదం కింద దాన్ని చిత్రీకరించాలని ప్రయత్నించాడన్నారు. మరి శవాన్ని తీసుకెళ్లి మృతుడి ఇంటి దగ్గర వదిలి వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి !
పోలీసులేమో సుబ్రహ్మణ్యం మద్యం తాగినట్లు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో మద్యం గురించి ప్రస్తావన లేదు. దీన్ని బట్టి పోలీసులు చెబుతున్నది నమ్మశక్యంగా లేదు. దీనిపై ఉన్నత స్థాయిలో జ్యూడిషల్ విచారణ జరిగితే తప్ప వాస్తవాలు బయటకు రావు.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
