ఓ జిల్లాకు ఒక మహనీయుడు పేరు పెడితే ప్రజలు ఇంత దారుణాలకు పాల్పడతారా .. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నలుగుతున్న చర్చ. కడప జిల్లాలో వైఎస్సార్ పేరును విభేదించే వాళ్లు లేరా ! ఎన్ఠీఆర్ జిల్లాకు కృష్ణా జిల్లా ప్రజలంతా ఆమోదించారా ! ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఏ ఒక్క జిల్లా ప్రజల అభ్యంతరాలను పట్టించుకోలేదు. చివరకు కోనసీమ జిల్లాకు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని వచ్చిన వినతులనూ తోసిపుచ్చింది. అన్ని జిల్లాల విజ్ఞప్తులను పట్టించుకోని ప్రభుత్వానికి ఒక్కసారిగా అంబేద్కర్ పై ప్రేమ పుట్టుకొచ్చిందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
అమలాపురంలో అల్లర్లు చెలరేగడానికి ముందే చిన్న చిన్న గ్రామాల్లో నిరసనలు మొదలయ్యాయి. పోలీసులు ఆవైపు దృష్టి సారించారు. పోలీసులు అప్రమత్తం అయివుండాలి. పట్టణంలో ఒక్కసారిగా సుమారు 15 వేల మంది ఆందోళనకు దిగారంటే పోలీసు నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది !
అంబేద్కర్ పేరు పెట్టడం ఇష్టం లేకున్నా రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపే తీరిక.. ఓపికలు ఎంతమందిలో ఉంటాయి ! ఏ రాజకీయ అండదండలు లేకుండా.. ప్రేరేపించకుండా.. ఆర్గనైజ్ చేయకుండా ఓ మంత్రి ఇంటిని దహనం చేసేంత టెంపరితనానికి ఎవరు పాల్పడతారు ! ప్రజా సమస్యలపై వినతి పత్రం సమర్పించడానికి వెళ్తేనే మంత్రి నివాసానికి ఫర్లాంగు దూరంలో పోలీసు బలగాలు అడ్డుకుంటున్నాయి. ఇక్కడ మంత్రి నివాసంపైకి అంతమంది ఎలా దూసుకెళ్లారు ! మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టే ఘాతుకానికి ఎలా పాల్పడ్డారు !
ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలను రెచ్చగొడుతోంది విపక్షాలని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడానికే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హత్యకు పాల్పడిన ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, రాజకీయంగా విపక్షాలను దెబ్బతీయడానికే అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆయా నేతలు విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా పరస్పర విమర్శలకు అన్ని పక్షాలు చెక్ పెట్టాలి. చాలా సున్నితమైన విషయం అల్లర్ల దాకా దారి తీసిన పరిస్థితులపై హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సీబీఐతో విచారణ జరిపించాలి. అంతకన్నా ముందుగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో పీస్ కమిటీలు వేయాలి. ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావం, ఆందోళనలను తొలగించేందుకు కృషి చేయాలి. అందుకు ప్రభుత్వం నైతిక బాధ్యతగా చొరవ చూపాలి.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
