అసలు ఆ బూతులేంటీ.. ఆ మాటలేంటీ ! వాసేనా ఇలా మాట్లాడేది ! ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా చిర్నవ్వుతో వెళ్లిపోయే బాలినేని శ్రీనివాసరెడ్డేనా ఈయన. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. రెండు సార్లు మంత్రిగా చేసిన అనుభవం ఏమైందీ ! ఎందుకిలా మారిపోయారని అధికార ప్రతిపక్షాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం ప్రకాశం జిల్లాలోనే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా సహకార సొసైటీ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన మిల్లరు మోసం చేశాడని బాలినేని దృష్టికి తీసుకొచ్చింది. అతనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ నిలదీసింది. ఆమకు మద్దతుగా గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు వచ్చారు. ఇక అక్కడ మాటామాటా పెరగడంతో బాలినేని సంయమనం కోల్పోయి బూతులు అందుకున్నారు. స్థూలంగా జరిగింది ఇది.
పబ్లిక్‌లో కేవలం జేజేలు కొట్టే అనుచరులే కాదు. ఇతర పార్టీలకు జై కొట్టేవాళ్లు కూడా ఉంటారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారు. కొందరు కాస్త గట్టిగా నిలదీస్తారు. ఇంకొందరు అసహనంతో రెచ్చిపోతారు. అపరిష్కృతమైన సమస్యల పరిష్కారాన్ని ముందు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఆందోళనలు చేసేవాళ్లూ ఉంటారు. రాజకీయంగా పై చేయి అనిపించుకోవడానికి చేసే నిరసనలు కూడా ఉంటాయి. అన్నింటికీ చాకచక్యంగా స్పందించే నేర్పరితనం ఉండాలి.
గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు చిర్నవ్వుతో వెళ్లిపోయే వాసు ఇప్పుడు కనిపించలేదు. తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు కనిపిస్తోంది. నిన్నమొన్నటిదాకా జిల్లాను శాసించిన బాలినేని ఒక్కసారిగా ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. మంత్రిగా తనను కొనసాగిస్తారనుకుంటే అంచనాలు తారుమారయ్యాయి.
మంత్రిగా ఆదిమూలపు సురేష్‌ను కొనసాగిస్తూ బాలినేనికి అవకాశం ఇవ్వకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. బాలినేని హవాను తగ్గించడానికే సీఎం జగన్ ఇలా చేశారనే ప్రచారం జరిగింది. ఇలాంటివన్నీ వాసును డిప్రెషన్లోకి నెట్టినట్లు వైసీపీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారు. అందువల్లే ఆయన అలా ప్రవర్తించి ఉండొచ్చు. ఏదిఏమైనా బాలినేని శ్రీనివాసరెడ్డి నోట బూతులు రావడం వింతే మరి.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
