మహానాడులో తెలుగు దేశం పార్టీ ఏఏ అంశాలపై తీర్మానాలు చేస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. రానున్న ఎన్నికల్లోపు పార్టీ కర్తవ్యాలపై ఈ తీర్మానాలు ఉండొచ్చు. ఈ తీర్మానాలకు అనుగుణంగానే పార్టీ కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. ఉదయం పదిన్నరకు ప్రతినిధుల సభ ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఇక ఏ అంశాలపై తీర్మానాలు చేస్తారనేది చర్చనీయాంశమైంది.
మొత్తం 17 తీర్మానాలు చేయాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. అందులో ఏపీకి సంబంధించి 12 అంశాలున్నాయి. తెలంగాణకు సంబంధించి 3, అండమాన్‌కు సంబంధించి ఒక తీర్మానం ఉంటుంది. అంతిమంగా పార్టీ రాజకీయ వైఖరిపై మరో తీర్మానం చేస్తారు. వీటి అమలు కోసం తెలుగు దేశం పార్టీ పనిచేస్తుంది.
సభలో తొలుత గడచిన ఏడాది కాలంలో కాలం చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. అనంతరం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అధినేత చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం ఉంటుంది.

ఇక తీర్మానాల విషయానికొస్తే.. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్లో కుల మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ప్రజల్లో చీలికలు సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలనే ఎత్తుగడలు అమలు చేస్తున్నాయి. వీటిని తిప్పికొడుతూ సమస్యలపై ప్రజల్లో ఐక్యతను పెంపొందించే దిశగా పార్టీ కృషి చేయాలని తీర్మానం చేస్తుందా !
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రజలపై భారాలు మోపుతున్నాయి. కేంద్రం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచింది. ఇటీవల తగ్గించింది చాలా స్వల్పం. నిత్యావసరాల ధరలు చుక్కలు చూస్తున్నాయి. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేస్తుందా లేదా అనేది చూడాలి.
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ తగ్గించలేదు. రవాణా, విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచేసింది. ఆస్తి, ఇంటిపన్నులు పెంచింది. మద్యం ధరలతోపాటు సిమెంటు, ఇసుక, స్టీల్ ధరలు పెరిగాయి. ఈ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ఉండొచ్చు.
ఏపీ ప్రభుత్వం ఎస్సీఎస్టీబీసీ మైనార్టీలను మోసపూరిత పథకాలతో దగా చేస్తోంది. గతంలో ఆయా వర్గాలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసింది. కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. ప్రభుత్వం తిరిగి రద్దు చేసిన పథకాలను అమలు చేయాలని తీర్మానం చేయొచ్చు. పోలవరం నుంచి అనేక ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. సత్వరమే ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని మరొక తీర్మానం ఉండొచ్చు. ఇంకా అమరావతి రాజధాని నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలనే తీర్మానం చేయొచ్చు.
ఈ తీర్మానాలన్నీ ఒక ఎత్తు. రాజకీయ తీర్మానం కీలకం. రాజకీయంగా టీడీపీ వైఖరి జాతీయ స్థాయిలో ఎలా ఉండాలి. రాష్ట్రంలో ఏ పార్టీతో ఎలా వ్యవహరించాలనేది నిర్ణయిస్తుంది. జాతీయంగా బీజేపీకి అనుకూలమా.. వ్యతిరేకమా.. కాంగ్రెస్ పార్టీ పట్ల టీడీపీ లైన్ ఎలా ఉంటుందనేది ఈ తీర్మానం ద్వారా వెల్లడవుతుంది.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
