టీడీపీ మహానాడులో ఏఏ అంశాలపై తీర్మానం చేయనున్నారనేది ఇప్పటిదాకా ప్రజల్లో ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ విడుదల చేసిన తీర్మానాల పట్టిక చూశాక మరో కొత్త అనుమానం మొదలైంది. ఓ రాజకీయ పార్టీ తీర్మానం చేయడమంటే దానికి పరిపూర్ణత ఉండాలి. సమస్యను గుర్తించి మాట్లాడడం వరకు ఓకే. దాన్ని ఎవరు పరిష్కరించాలని డిమాండ్ చేయడం ముఖ్యాంశం. టీడీపీ మహానాడులో ఏఏ అంశాలపై తీర్మానాలు చేస్తున్నామన్నది వెల్లడించింది. ఇక్కడ ప్రజా సమస్యలను పరిష్కరిచాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నారా.. తాము అధికారానికి వచ్చాక అమలు చేస్తున్నామంటున్నారా అనేదే స్పష్టత లేదు.
మహానాడులో టీడీపీ చేస్తున్న తీర్మానాలను పరిశీలిస్తే.. బాదుడే బాదుడు పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న భారాల గురించి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, బీద రవిచంద్ర, గౌతు శిరీష తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ భారాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారా.. లేక టీడీపీ అధికారానికి వస్తే తొలగిస్తామంటున్నారా అనేది స్పష్టతనివ్వలేదు.
ఇంకా కష్టాల కడలిలో సేద్యం.. దగా పడుతున్న రైతన్న అనే అంశంపై మరో తీర్మానం. దీన్ని దూళిపాళ్ల నరేంద్ర, మంతెన రాజు ప్రవేశపెడతారు. సేద్యం చేస్తోంది 80 శాతం కౌలు రైతులు. వాళ్ల కోసం ఏం చేయాలని టీడీపీ తీర్మానం చేస్తుందనేది ప్రశ్నార్థకం.
పడకేసిన సాగునీరు..తాగునీటి ప్రాజెక్టులపై బీసీ జనార్ధన్‌రెడ్డి సభలో ప్రతిపాదిస్తారు. దీనికి కారకులెవరు.. ఎందువల్ల.. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరతారా లేక తాము అధికారానికి వచ్చాక పూర్తి చేస్తామంటారా ! ఇక పోలవరం.. అమరావతి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రతిపాదిస్తారు. ప్రభుత్వం వీటిని పూర్తి చేయాలని కోరుతున్నారా లేక తాము అధికారానికి వచ్చాక చేస్తామంటారా అనేది స్పష్టత లేదు.

రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని.. విద్యుత్ కోతలపై దువ్వారపు రామారావు ప్రతిపాదనలు పెడతారు. వాటిని ఆమోదించి తీర్మానం చేయాలి. వీటిని ప్రభుత్వం చేయాలంటున్నారా లేక తాము అధికారానికి వచ్చాక చేస్తామంటున్నారనేది తెలీడం లేదు. బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేసిందనే దానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బీటీ నాయుడు, ఎంఎస్ రాజు, ఎండీ నజీర్ ప్రతిపాదనలు చేస్తారు.
నిమ్న వర్గాలకు చేస్తున్న ద్రోహాన్ని ఆపి పాత పథకాలు అమలు చేయమంటారా లేక తాము అధికారానికి వచ్చాక చేస్తామంటారా అనేది తీర్మానంలో వివరించాలి. ఏదైనా టీడీపీ విడుదల చేసిన తీర్మానాల పట్టికలో ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారనేది గందరగోళంగా ఉంది. ఏం తీర్మానిస్తారో తెలిశాకనే అసలు విషయం బోధపడుతుంది.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
