ఆకలి ఎంతకైనా తెగించమంటుంది. ప్రాణాలు నిలుపుకోవడం కోసం తోటి మనిషిని తొక్కుకుంటూ పొమ్మంటోంది. మానవత్వం ఉనికిని చాటలేకపోయింది. తిండి కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. తొక్కిసలాటలో 31 మంది విగతజీవులయ్యారు. అందులో అభంశుభం తెలియని చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన శనివారం దక్షిణ నైజీరియాలోని ఓ చర్చిలో చోటుచేసుకుంది.
దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ పట్టణంలోని ఓ చర్చ్ స్థానిక పోలో క్లబ్ లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం భారీగా ప్రచారం చేశారు. ఆహారంతో పాటు మంచి గిఫ్టులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. దీంతో చర్చి దగ్గరకు జనాలు భారీగా తరలివచ్చారు. ఫుడ్, గిఫ్టులు తీసుకునేందుకు క్యూలో నిలబడ్డారు.
అయితే డొనేషన్ డ్రైవ్ నిర్వహకుల అంచనా కంటే భారీగా ప్రజలు అక్కడికి వచ్చారు. దీంతో పంపిణీ కష్టంగా మారింది. అదే సమయంలో క్యూలో నిల్చున్న జనాలు అసహనానికి లోనయ్యారు. తమ వంతు వరకు వస్తుందా రాదా అన్న ఆందోళనతో ఒక్కసారిగా ముందుకు ఎగబడ్డారు.
చాలా మంది గేట్లు పగలగొట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో క్యూలెన్లలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు. గాయపడిన ఏడుగురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం రాగానే అక్కడికి వెళ్లిన పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేశారు.
తొక్కిసలాట జరిగే సమయానికి ఇంకా బహుమతుల పంపిణీ ప్రారంభం కాలేదని నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రతినిధి ఒలుఫెమి అయోదెలె చెప్పారు. గేటు మూసి ఉన్నా లోపలికి వెళ్లేందుకు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్థు చేస్తున్నారు. సరైన వసతులు లేకుండా డొనేషన్ డ్రైవ్ నిర్వహించిన నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
