జనసేన పార్టీ తమ పట్టు నుంచి జారిపోకూడదని మరో ఎత్తుగడ వేసింది. బీజేపీ.. జనసేన సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ అని ప్రకటిస్తారట. జూన్ 6న ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ పర్యటనలో ప్రకటిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఏపీలో బీజేపీ ఓటింగ్ శాతం నోటా కన్నా తక్కువ. ఆరేడు శాతం ఓట్లు కలిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం ఎలా అవుతారు ! మెడ మీద తలకాయ ఉన్నోళ్లకు ఇది బాగానే అర్థమవుతోంది. మరి దీనిపై జన సైనికుల స్పందన ఎలా ఉంటుందో మరి.
వాస్తవానికి జనసేన పార్టీ టీడీపీతో కలిస్తే కనీసం కొన్ని సీట్లయినా గెల్చుకునే అవకాశముంది. ప్రస్తుతం జనసేనపై కాపు సామాజిక వర్గం బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ దఫా పవన్‌తోపాటు కొందరైనా అసెంబ్లీ మెట్లు ఎక్కలేకుంటే ఆ పార్టీ మనుగడే కష్టం.
ఇటీవల కాలంలో జనసేన ప్రజలతో మమేకమవుతూ తన బలాన్ని పెంచుకుంది. టీడీపీతో కలిస్తే పరిమితమైన ప్రయోజనాలు పొందొచ్చు. అదే బీజేపీతో కలిసి పోటీ చేస్తే కనీసం ఒక్క సీటయినా గెలుస్తామన్న ధీమా ఉందా ! ఒకవేళ బీజేపీ వద్ద ఏవైనా మాయలు.. మంత్ర దండాలుంటే చెప్పలేం.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా తాను ఎంత దూరమైనా వెళ్తానని పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్పష్టం చేశారు. దీనికి తాము సిద్దమన్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు సంకేతాలిచ్చారు. తర్వాత వీళ్ల మధ్య బహిరంగ చర్చలు జరగలేదు. ఈమధ్యనే సీట్లపై రహస్య మంతనాలు సాగించినట్లు ఇరు పార్టీల నాయకుల నుంచి లీకులు బయటకొచ్చాయి. చివరగా జనసేన 50 సీట్లతో సరిపెట్టుకోవచ్చనేది వీటి సారాంశం.
ఈసంగతి ఎప్పుడైతే బయటకు పొక్కిందో వెంటనే కాషాయ నేతల్లో గుబులు మొదలైంది. ఓవైపు వైసీపీకి తెరచాటు నుంచి సహకారమందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కేంద్ర విధానాలను తూచా తప్పకుండా అమలు చేయడంలో బీజేపీకి వైసీపీ కన్నా నమ్మకమైన మిత్రుడు మరొకరు లేరు. టీడీపీ వైపు పవన్ వెళ్లకుండా ఇప్పటిదాకా జనసేనతో మిత్రత్వం కొనసాగించారు.
ఇప్పుడు తమ పట్టు నుంచి పవన్ ఎక్కడ జారిపోతారోననే ఆందోళన నెలకొంది. అందుకే బీజేపీ, జనసేన సీఎం అభ్యర్థి పవన్ అనే పదం లంకించుకున్నారు. టీడీపీని కలుపుకోకుంటే తాను బీజేపీని వీడాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ ఈపాటికే ఆ పార్టీ కేంద్ర పెద్దలకు మొహమాటం లేకుండా చెప్పేశారు.
ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది. బీజేపీకి చెందిన ఏపీ నేతలు మాత్రం తాము టీడీపీతో కలిసే చాన్సే లేదని కుండబద్దలు కొడుతున్నారు. దీంతో అనివార్యంగా పవన్ కల్యాణ్ టీడీపీ స్నేహ హస్తం అందుకునేందుకు సిద్దమయ్యారు. ఇదే జరిగితే వామపక్షాలు కూడా వీళ్లతో భాగస్వాములయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే అది పవన్ కల్యాణ్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
